- అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకంతో రైతుల కుటుంబాల్లో సంతోషం.
- రైతు సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం.
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
తమది రైతు పక్షపాత ప్రభుత్వం అన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ.. గత ఎన్నికల సమయంలో హమీ ఇచ్చినట్లుగానే సూపర్ సిక్స్ సహా అన్ని హామీలను అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా పేరుతో హంగామా చేసి ఏడాదికి 13,500 ఇస్తామని చెప్పి 7,500 మాత్రమే ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు.
కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన విధంగానే ఒక్కొక్క రైతుకు ఏడాదికి 20 వేలు ఇస్తున్నామన్నారు. మొదటి విడతగా ఈ ఏడాది ఆగస్టులో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 7,000 జమ చేయగా, ఇప్పుడు రెండో విడతలో బుధవారం మరో 7,000 జమ చేయడం జరిగిందని ఎంపీ అన్నారు.
అర్హులైన 46,85,838 రైతుల బ్యాంకు ఖాతాల్లో మొదటి విడతలో ఆగస్టులో 3,174 కోట్లు జమ చేయగా, రెండో విడతలో మరో 3,135 కోట్లు ఇప్పుడు జమ చేయడం జరిగిందని, రెండు విడతల్లో కలిపి ఇప్పటివరకూ మొత్తం 6,309.44 కోట్లు రూపాయలు పెట్టుబడి సాయంగా రైతులకు అందించడం జరిగింది. ఇది దేశంలోనే రికార్డు అని, మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయి సహాయం రైతులకు అందించిన ప్రభుత్వం లేదన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
అర్హత ఉన్న ఏ ఒక్క రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఈ కేవైసీ, ఎన్పీసీఐ యాక్టివేషన్ లేని రైతుల సమస్యలు కూడా పరిష్కరించి, వారిని తిరిగి లబ్ధిదారుల జాబితాలో చేర్చామని, అలాగే చనిపోయిన రైతుల వారసులకు మ్యుటేషన్ చేసి పథకం వర్తించేలా చేస్తున్నామని, ఇది రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు ఎంపీ పుట్టా మహేష్.
అదే విధంగా ఏలూరు పార్లమెంట్ పరిధిలోని పొగాకు, పామాయిల్, కోకో రైతుల ఇబ్బందులను, కొల్లేరు ఆక్వా రైతుల సమస్యలను తాను ఎప్పుడు ప్రస్తావించినా ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్న విధానాన్ని కూడా ప్రజలంతా గమనిస్తూ, ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాలను నమ్మకుండా రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వానికి మద్దతిస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ, రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ లకు ఎంపీ పుట్టా మహేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

