- జిల్లాలో అభివృద్ధి పనుల్లో అలసత్వంపై ఎంపీ ఆగ్రహం.
- ఎంతో కష్టపడి తాను రోడ్లు, రైల్వే ఆర్వోబీలకు అనుమతులు తీసుకువస్తుంటే అధికారుల్లో చలనం ఉండటంలేదని ఎంపీ ఆవేదన.
- పనుల పురోగతిపై ఖచ్చితమైన డేట్ లైన్ విధించుకుని పనిచేయాలని హితవు.
- ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో అవకతవకలపై నిలదీసిన ఎంపీ
- ఎంపీ ప్రశ్నలకు నీళ్లు నమిలిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్.
🔴 ఏలూరు జిల్లా : కలెక్టర్ కార్యాలయం : ది డెస్క్ :
ఏలూరు కలెక్టరేట్ లో మంగళవారం జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ…
కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు నత్త నడకగా సాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు పట్టణం 32వ డివిజన్ పరిధిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ. 64.08 లక్షలు ఎంపీ నిధులతో చేపట్టిన పోలీస్ విశ్రాంతి మహిళ, పురుషుల బ్యారక్ నిర్మాణ పనులు 9 నెలలైనా పూర్తికాకపోవడంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు చివరిదశకు వచ్చాయని, నెల రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. జిల్లాలో దారుణంగా దెబ్బతిన్న రోడ్ల నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టాలని ఎంపీ కోరారు. అదేవిధంగా రోడ్ల నిర్మాణంలో నాణ్యతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
అధ్వాన్నంగా మారిన జంగారెడ్డిగూడెం- ఏలూరు రోడ్డు నిర్మాణం పనులు ఇటీవలే మొదలయ్యాయని, మొదటి దశలో 11 కోట్ల NDB నిధులతో 6 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై స్పందించిన ఎంపీ జంగారెడ్డిగూడెం- ఏలూరు రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. ఈ రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు కేంద్రంతో మాట్లాడుతానని ఎంపీ తెలిపారు.
ఏలూరు పార్లమెంట్ పరిధిలోని రైల్వే శాఖకు సంబంధించిన పనుల పురోగతిపై సమీక్షించిన ఎంపీ.. 12 ఆర్వీబీలకు కేంద్రం నుంచి ఆనుమతులు వచ్చినప్పటికీ నిర్మాణ పనులు ఇంతవరకూ మొదలు కాకపోవడంపై ప్రశ్నించారు. అప్రోచ్ రోడ్లతో సహా రైల్వే శాఖనే ఆర్వీబీల నిర్మాణ బాధ్యత చేపట్టాలని ఈ సందర్భంగా ఎంపీ స్పష్టం చేశారు.
దీనిపై సమాధానమిచ్చిన రైల్వే అధికారులు.. ఎంపీ ప్రతిపాదనలను ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళతామని చెప్పారు. ఏలూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు 2026 ఫిబ్రవరి కల్లా పూర్తవుతాయని ఈ సందర్భంగా రైల్వే శాఖ అధికారులు హామీ ఇచ్చారు. కొవ్వూరు – భద్రాచలం రైల్వే లైన్ డీపీఆర్ లో జంగారెడ్డిగూడెం వద్ద తప్పనిసరిగా రైల్వే స్టేషన్ ఉండాలని అధికారులకు సూచించారు ఎంపీ.
ఏలూరు పార్లమెంట్ పరిధిలో 62 పెద్ద పరిశ్రమలు ఉన్నాయని, వారిని CSR కింద నిధులు ఇచ్చి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములయ్యేవిధంగా ఆఆ పరిశ్రమల అధిపతులతో మాట్లాడాలని అధికారులను ఎంపీ ఆదేశించారు. ప్రతి మేజర్ కంపెనీ తమ లాభాల్లో 5 శాతం కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద ఖర్చు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ, అనేక సంస్థలు నిధులు ఇవ్వటం లేదని, దీనిపై పరిశ్రమల శాఖ అధికారులు దృష్టిపెట్టాలని ఎంపీ సూచించారు.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం, ఆసుపత్రి నిర్వహణ తీరుపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్లకు మందులు సరిగా ఇవ్వటం లేదని, చిన్న చిన్న స్థాయి వైద్యం చేయాల్సిన కేసులు కూడా విజయవాడ ఆసుపత్రికి పంపిస్తున్నారన్న ఆరోపణలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ పై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉందని, సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీలో తాను స్వయంగా చూశానని చెప్పిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, నిత్యం వందలాది మంది పేద ప్రజలు వైద్యం కోసం వచ్చే సర్వజన ఆసుపత్రి నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ..
మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాల్సిన 108 వాహనాలను ఏలూరు ప్రభుత్వాసుపత్రి నుంచి విజయవాడకు పేషంట్లు తరలించడానికి ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆసుపత్రి సూపరింటెండెంట్.. ఆరోపణలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటానని, సిబ్బంది కొరత వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ..
ఈ దిశా సమావేశంలో ప్రస్తావించిన విషయాలు, సమస్యలపై నిరంతర సమీక్షలు జరిపి, వచ్చే సమావేశంలోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం కొద్దిసేపు మీడియాతో మాట్లాడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. ఎంతో కష్టపడి తాను రోడ్లు, రైల్వే ఆర్వోబీలకు, ఇతర ప్రాజెక్టులకు అనుమతులు తీసుకువస్తుంటే అధికారుల్లో చలనం ఉండటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్లమెంటు పరిధిలో ఇప్పటికే ఐదు పరిశ్రమలు తీసుకువచ్చానని, మరో నాలుగు పరిశ్రమలకు వచ్చే రెండు మూడు నెలల్లో శంకుస్థాపనలు చేయనున్నామని వెల్లడించారు. ప్రజాప్రతినిధులకు అధికారులు సహకరించి వేగంగా పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

