కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
పిజిఆర్ఎస్ మీకోసం అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఆయన కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డీఆర్ఓ కే చంద్రశేఖరరావు, అదనపు ఎస్పీ కే ఆర్ ఆర్ సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవితో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు.
కార్యక్రమానికి ముందు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మీకోసం కార్యక్రమంలో ప్రజలు సమర్పించే అర్జీలను పరిష్కరించే విధానం, వాటిని ఆన్లైన్లో సమర్పించే ప్రక్రియపై అధికారులకు అవగాహన కల్పిస్తూ.. దీనిపై ఎన్నో సార్లు అవగాహన కల్పించినప్పటికీీ పదే పదే అవే తప్పులు పునరావృతం అవటం పట్ల నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేక చేసే తప్పులు వల్ల అర్జీలు రీఓపెన్ అవుతున్నాయని, అర్జీ ఎండార్స్మెంట్ చేసే విధానంపై సంబంధిత అధికారులు కిందిస్థాయి అధికారులకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని సూచించారు.
అర్జీదారు లబ్ధి పొందితే తప్ప సిటిజెన్ బెనిఫిట్ డ్ ఆప్షన్ ఎంచుకోవద్దని, సమస్య ప్రభుత్వ పరిధిలో ఉంటే గనుక అదే అంశాన్ని అక్కడ తెలపాలని సూచించారు. వచ్చే సారి అవే తప్పులు పునరావృతం అయితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆయన, కొంతమంది అధికారులు తప్పుగా చేసిన కొన్ని ఆన్లైన్ అర్జీల ఎండార్స్మెంట్లను స్క్రీన్ పై చూపించి మరోసారి అవగాహన కలిగించారు.
డిఆర్ఓ మాట్లాడుతూ.. ఐ గాట్ కర్మయోగి ఆన్లైన్ కోర్సులను పూర్తి చేయడంలో చాలా డిపార్ట్మెంట్లు వెనుకబడి ఉన్నాయని, త్వరితగతిన పూర్తి చేయించే విధంగా తమ సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించారు.
అర్జీలలో కొన్ని:
తనకు కళాశాల చదువులు చదువుకుంటున్న ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని, పిల్లల చదువుల కోసం బ్యాంకు ఖాతాలో దాచుకున్న నగదు పిల్లలకు అవగాహన లేక చేసిన పొరపాటుకు సైబర్ నేరగాళ్ల ద్వారా దాదాపు రూ.94 వేలు పోగొట్టుకున్నానని, తగిన న్యాయం చేసి ఆదుకోవాలని పామర్రు మండలం, పామర్రు గ్రామానికి చెందిన ఊసల అనిత అర్జీ ద్వారా కలెక్టర్కు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన ఆయన పీ–4 కార్యక్రమం ద్వారా పిల్లల చదువులకు అవసరమైన సహాయానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
2006లో నాగాయలంక మండలం, పెదపాలెం గ్రామంలో అప్పటి ప్రభుత్వం రెండు సెంట్లు చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని, అయితే ఇప్పటివరకు స్థలాలు చూపించలేదని, భూమి చూపిస్తే ఇళ్లు కట్టుకుంటామని గ్రామానికి చెందిన దాదాపు 20 మంది మహిళలు కలెక్టర్కు అర్జీ ద్వారా కోరారు. దీనిపై ఆయన సంబంధిత తహసిల్దారుతో ఫోన్ లో మాట్లాడిన అనంతరం, మంజూరు చేసిన భూమిలో జంగిల్ క్లియరెన్స్ చేయించి త్వరలో ఇళ్ళ స్థలాలు ఇస్తామని కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు.
నివాసం ఉంటున్న ఇంటిని తన ఇద్దరు కుమారులు వారిద్దరి పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుని, తమను ఇంటి నుంచి గెంటివేశారని, తమ బాగోగులు పట్టించుకోకుండా శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వృద్ధులైన భార్యాభర్తలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. సదరు రిజిస్ట్రేషన్ రద్దు చేయించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఉయ్యూరు మండలం, కాటూరు గ్రామానికి చెందిన ఇందిరాసి సూరిబాబు, రామలక్ష్మీ అర్జీ సమర్పించారు.
కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

