The Desk…Eluru : కాకినాడ – భావ్‌నగర్ ట్రైను కు ఏలూరు స్టేషన్‌లో హాల్టు ఇవ్వండి.. రైల్వే డీఆర్ఎంకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లేఖ

The Desk…Eluru : కాకినాడ – భావ్‌నగర్ ట్రైను కు ఏలూరు స్టేషన్‌లో హాల్టు ఇవ్వండి.. రైల్వే డీఆర్ఎంకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లేఖ

🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :

స్పందించిన విజయవాడ డీఆర్ఎం..

ఏలూరు నియోజకవర్గ ప్రజల విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని కాకినాడ – భావ్‌నగర్ ట్రైనుకి (రైలు నంబర్ 12755/12756)  ఏలూరు స్టేషన్ లో హాల్ట్ ఏర్పాటు చేయాలని కోరుతూ విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ కు లేఖ రాశారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరు నుంచి సూరత్ మరియు షోలాపూర్‌లకు ఎక్కువగా ప్రయాణించే వ్యాపార వర్గాలతో పాటు, అహ్మదాబాద్ మరియు చుట్టుపక్కల ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలకు ఉన్నత చదువుల కోసం ఏలూరు నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరచుగా ప్రయాణిస్తుంటారని, ముఖ్యంగా ఈ ప్రాంత భక్తులు శ్రీ స్వామినారాయణ మందిర్, శ్రీ తక్తేశ్వర్ ఆలయం, ఇస్కాన్, శ్రీ ద్వారకాధీష్ ఆలయం, బెట్ ద్వారకా ఆలయం మొదలైన యాత్రా స్థలాలను సందర్శించుకుంటుండటంతో నిరంతరం డిమాండ్ ఉందనే విషయాన్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకువచ్చారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

కాకినాడ – భావ్‌నగర్ మధ్య వారానికోసారి నడిచే ఈ ట్రైనుకి రాజమండ్రి తర్వాత విజయవాడ వరకూ హాల్ట్ లేకపోవడం ప్రయాణికులకు ఇబ్బందిగా ఉందని చెబుతూ దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ మేనేజర్ కు రాసిన లేఖలో వివరించిన ఎంపీ, ఏలూరులో హాల్టు ఏర్పాటును పరిశీలించాల్సిందిగా  కోరారు.

ఏలూరు నియోజకవర్గం తయారీ మరియు వ్యవసాయ కేంద్రంగా ఉందని, ముఖ్యంగా వస్త్ర, తోలు వస్తువులు, తివాచీలకు కేంద్రంగా, మరియు ఆయిల్ పామ్, బియ్యం, పొగాకు మరియు చక్కెరకు ప్రముఖ వ్యవసాయ ప్రాంతంగా కూడా ఉందని అందువల్ల ఏలూరులో హాల్టు ఏర్పాటు అన్ని వర్గాల ప్రజలకూ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు.

‎స్పందించిన డీఆర్ఎం..
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రాసిన లేఖకు రైల్వే అధికారులు స్పందించారు. కాకినాడ – భావ్‌నగర్ ట్రైనుకి ఏలూరులో హాల్టు ఇచ్చే విషయంపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెబుతూ ఎంపీకి రాసిన ప్రత్యుత్తరంలో విజయవాడ అడిషనల్ డీఆర్ఎం ఎడ్విన్. సమాధానమిచ్చారు.

‎మరొక ప్రకటనలో …బీహార్ లో ఎన్డీఏ కూటమి ఘన విజయంపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం :

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ బీహార్ లో ప్రతిపక్ష కూటమి ఆచరణ సాధ్యంకాని హామీలను ఇచ్చినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా బీహార్ యువత, ప్రజలు వాటిని నమ్మకుండా, విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయటం సంతోషకరమన్నారు. ఈ అద్భుత విజయం అందించిన బీహార్ ఓటర్లకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.

‎డబల్ ఇంజన్ సర్కార్ తో ఇక బీహార్ లో అభివృద్ధి మరింత వేగంగా దూసుకెళుతుందనే విశ్వాసం వ్యక్తం చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఆభివృద్ధి అనేది నిరంతరాయంగా కొనసాగాలంటే ఏ రాష్ట్రంలోనైనా ఒకే ప్రభుత్వం స్థిరంగా అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

బీహార్ లో ఘన విజయానికి కారకులైన ప్రధాని నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు, ఎల్జేపీ (RV ) నేత చిరాగ్ పాసవాన్ కు, ఇతర ఎన్డీఏ నేతలకు, అదేవిధంగా బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్డీఏ కూటమి విజయానికి తనవంతు కృషి చేసిన యువనేత నారా లోకేష్ కి ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు.

వికసితభారత్ లక్ష్యాలను చేరుకోవడంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి బీహార్ విజయం మరింత బలాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేశారు.