The Desk…Vuyyuru : అక్రమ లేఔట్ లు, కామన్ సైట్ల అన్యాక్రాంతంపై డిపిఓ ఫైర్

The Desk…Vuyyuru : అక్రమ లేఔట్ లు, కామన్ సైట్ల అన్యాక్రాంతంపై డిపిఓ ఫైర్

  • గండిగుంట్ల ఆక్రమణకు గురైన కామన్ సైట్ల పరిశీలన
  • వారం రోజుల్లో చర్యలు తీసుకుంటామని మీడియాకు వివరణ

🔴 కృష్ణాజిల్లా : ఉయ్యూరు : ది డెస్క్ :

అక్రమ లేఔట్ లు, కామన్ సైట్ల అమ్మకాలపై జిల్లా పంచాయతీ అధికారి ఫైర్ అయ్యారు. మండలంలోని గండిగుంట గ్రామంలో అక్రమ లేఅవుట్ యాజమాన్యాలు చివరకు కామన్ సైట్లను సైతం అన్యాక్రాంతం చేయడంపై సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ గత 15 సంవత్సరాలుగా నిరంతరం పోరాడుతున్నారు.

ఈక్రమంలో కృష్ణాజిల్లా అధికారులతో పాటు లోకాయుక్త న్యాయస్థానాన్ని ఇటీవల ఆశ్రయించారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి అరుణ గురువారం గండిగుంట్లొని పలు లేఔట్లను అన్యాక్రాంతమైన కామన్ సైట్లను నిశితంగా పరిశీలించారు. గ్రామ పరిధిలో కార్పొరేట్ పీపుల్ సంస్థ ఏర్పాటుచేసిన లేఔట్ తో పాటు రోటరీ హాస్పిటల్ పక్కన ఉన్న లేఔట్ లోని ఆక్రమణకు గురైన కామన్ సైట్లను ఆమె నిశితంగా పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు.

సందర్భంగా DPO అరుణ మాట్లాడుతూ..

ప్రజాప్రయోజనార్ధం లేఔట్ లో కేటాయించిన పది శాతం ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారం రోజుల్లో మొత్తం లేఔట్లలో కామన్ సైట్లను గుర్తించి అన్యాక్రాంతం చేసిన వారిపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు. ప్రభుత్వ స్థలాలను , ప్రభుత్వ ఆస్తులు స్వాధీనంచేసుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత 20 సంవత్సరాల కాలంలో గండిగుంట గ్రామంలో యదేచ్ఛగా ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన అక్రమ లేఔట్ లపై ప్రభుత్వ నియమ నియమ నిబంధనలను అమలు చేస్తామన్నారు.

గడచిన కాలంలో ఏర్పాటుచేసిన అక్రమ లేఔట్ లపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి కామన్ సైట్లను ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తామన్నారు. గ్రామ పరిధిలో మొత్తం18 లేఔట్లు ఏర్పాటు చేయగా తొమ్మిది లేఔట్లకు ఎలాంటి అనుమతులు లేవని, కేవలం రహదారులు మాత్రమే ఏర్పాటు చేశారని ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం అన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేఔట్ ను ఏర్పాటు చేసి లేఔట్ ప్లాన్ లో చూపిన కామన్ సైట్లను అక్రమంగా ఇతరులకు విక్రయించడం చట్టాన్ని ఉల్లంఘించడమే అన్నారు.

గ్రామపంచాయతీలకు కామన సైట్లు, రహదారులకు చెందిన భూమి రిజిస్ట్రేషన్ చేయనప్పటికీ లేఔట్ ప్లాన్ అప్రూవల్లో పొందుపరిచిన విధంగా తప్పకుండా ఆయా భూములపై పంచాయతీకె అధికారం ఉంటుందన్నారు. పంచాయతీ పరిధిలో ఏర్పాటుచేసిన లేఔట్ లో పూర్తి బాధ్యత పంచాయితీలదేనన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో లేఔట్ లో రహదారులతో పాటు కామన్ సైట్లను సైతం విధిగా వెంచర్ నిర్వహకులు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సి ఉందన్నారు. లేకున్నప్పటికీ ఐపిఎల్పి నెంబర్ ద్వారా రహదారులను కామన్ సైట్లను పంచాయతీ అధికారులు తప్పకుండా తమ ఆధీనంలో ఉంచుకోవాలన్నారు. ప్రాంతం కాకుండా ఆయా వెంచర్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు కామన్ సైట్లకు సరైన రక్షణ కల్పించాల్సిఉంది అన్నారు.

లేవుట్ల సక్రమ నిర్వహణలో పంచాయతీ అధికార యంత్రాంగం అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గండిగుంట గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన తొమ్మిది వెంచర్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆమేరకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని జిల్లా పంచాయతీ అధికారి అరుణ స్పష్టం చేశారు. వారం రోజుల్లో గండిగుంటలో నెలకొన్న కామన్ సైట్ల వివాదాన్ని అనధికార లేఔట్ లో వివాదాన్ని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

జిల్లా వ్యాప్తంగా అనధికారాలు లేఔట్ లపై అధికార యంత్రాంగం కొరడా జులిపించేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. దీనికి తోడు అన్ని పంచాయతీల పరిధిలో ఉన్న లేఔట్ లో ప్రజాప్రయోజనార్ధం కేటాయించిన పది శాతం కామన్ సైట్ భూములు అన్యాక్రాంతం కాకుండా సంరక్షించాల్సిన బాధ్యత ఆయా పంచాయతీ కార్యదర్శులదే అని స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికార యంత్రాంగం అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

లేఔట్లలో భూములు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు ప్రజలు సైతం ఆయా లేఔట్లపై సరైన అవగాహన కలిగిన తర్వాతనే ప్లాట్లు కొనుగోలు చేయాలన్నారు. ఎలాంటి అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్ లు కొనుగోలు చేస్తే రానున్న కాలంలో వినియోగదారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతులు లేని వెంచర్లో ఎలాంటి సౌకర్యాలు ఉండవని, నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేస్తే రానున్న కాలంలో ఇబ్బందులు పడేది వినియోగదారులన్ని దానిని గుర్తించి అన్ని సౌకర్యాలు, వసతులు, అనుమతులు ఉన్న వెంచర్ల లోనే ప్లాట్లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. అనుమతుల్లేని లే అవుట్ లలో ప్లాట్లకు ఉంటే ఇళ్ల నిర్మాణం చేసుకోవటం కష్టతరమన్నారు. దీనికి తోడు త్రాగునీరు, విద్యుత్తు, రహదారులు, డ్రైనేజీలు సౌకర్యాలు ఉండవని, దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడవలసి వస్తుందన్నారు.

దీనిని గుర్తించి అనుమతులు ఉన్న వెంచర్లకే వినియోగదారులు ప్రాధాన్యతనిస్తే ఎలాంటి ఇబ్బందులు పడవలసిన దుస్థితి రాదని వివరించారు. గండిగుంటలో నెలకొన్న కామన్ సైట్ వివాదాన్ని త్వరితగతిన పరిష్కరించి అన్యాక్రాంతమైన భూమిని ప్రజాప్రయోజనార్ధం పంచాయతీ చట్టపరంగా స్వాధీనం చేసుకుంటుందని మీడియా ఎదుట స్పష్టం చేశారు. లేఔట్ల పరిశీలనలో ఉయ్యూరు డిప్యూటీ ఎంపీడీవో ఏఎస్ఆర్ కోటేశ్వరావు పంచాయతీ కార్యదర్శి, కుమార్ రావు తోపాటు గ్రామ రెవెన్యూ సర్వేర్, పలువురు పంచాయతీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమాలను ప్రోత్సహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి :
➖సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ డిమాండ్.

మండలంలోని గండిగుంట గ్రామంలో ఆక్రమణ గురైన కామన్ సైట్లకు గ్రామపంచాయతీ పరిధిలో రక్షణకల్పించాలని
సామాజిక కార్యకర్త శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు మేరకు జిల్లా పంచాయతీ అధికారి గండిగుంట్ల ఆయా లేఔట్లను పరిశీలించారు. ఈ తనిఖీలలో జిల్లా పంచాయతీ అధికారితోపాటు సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని తమ దగ్గర ఉన్న రికార్డులో పొందుపరిచిన వివరాలను డిపిఓకు వివరించారు.

సందర్భంగా జంపాన శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ…

నిబంధనల పేరుతో లేఔట్లను ఏర్పాటు చేయడంతో పాటు కామన్ సైట్లను సైతం అక్రమంగా అన్యాక్రాంతం చేసిన సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సుమారు 2002లో లేఔట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టిన లేఔట్ యజమానులకు నాటి నుండి నేటి వరకు సహకరించిన అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహించిన అధికారులను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతోనే అక్రమ లేఔట్లు రోజురోజుకి పెరుగుతున్నాయి అన్నారు దీనికి తోడు కామన్ సైట్లను సైతం అన్యాక్రాంతం చేస్తూ అక్రమార్కులు దండుకుంటున్నారని, ప్రజాధనం దుర్వినియోగం కావడంతోపాటు ప్రజాప్రయోజనాల కేటాయించిన భూములు సైతం అన్యాక్రాంతమై కోట్ల రూపాయల నష్టాన్ని తెస్తోందని గుర్తు చేశారు.

అంతటి ప్రాధాన్యత కలిగిన కామన్ సైట్లను పరిరక్షించాల్సిన బాధ్యత పంచాయతీ అధికారికి యంత్రాంగానికి ఉందని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయితీ అధికార యంత్రాంగంతో పాటు ఇతర సిబ్బందిపైన చర్యలు తీసుకొని కామన్ సైట్లకు రక్షణ కల్పించాలని కోరారు.