The Desk…Amaravati : దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన CGF, DDNS నిధుల పై సమీక్షా సమావేశం

The Desk…Amaravati : దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన CGF, DDNS నిధుల పై సమీక్షా సమావేశం

🔴 అమరావతి : ది డెస్క్ :

ఈ రోజు సచివాలయం రెండో బ్లాక్‌లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన కామన్ గుడ్ ఫండ్ (CGF), ధూప దీప నైవేద్య నిధి (DDNS) పై సమీక్షా సమావేశం జరిగింది.

సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ..:

“CGF నిధులు రాష్ట్రంలోని చిన్న మరియు మధ్య తరగతి ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యంగా వినియోగించాలి. నిధుల వినియోగంలో పారదర్శకత, సమయపాలన, మరియు బాధ్యతాయుత అత్యంత ముఖ్యమైనవి,” అని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం నియోజకవర్గాల వారీగా వచ్చిన లిస్ట్ ఆధారంగా నిధుల కేటాయింపు జరుగుతుందని, ఆలయాల అవసరాలు, భక్తుల సౌకర్యాలు, మరియు స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రాధాన్యత క్రమంలో నిధులు విడుదల చేయాలని ఆదేశించారు.

అలాగే CGF నిధుల ద్వారా ఆలయాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, గర్భగుడి, ప్రాకారాలు, రహదారులు, నీటి సదుపాయాలు, విద్యుత్ వ్యవస్థలు,భక్తుల సౌకర్యాల ఏర్పాట్లు,పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

దేవాదాయ శాఖ అధికారులు ఆలయ పున నిర్మాణ పనులు సమయానికి పూర్తి చేయాలని, అభివృద్ధి పనులు ఎప్పటికి అప్పుడు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.

అలాగే ధూప దీప నైవేద్య నిధి (DDNS) పై కూడా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఆనం ధూప దీప నైవేద్య పథకం పై మాట్లాడుతూ, “రాష్ట్రంలోని చిన్న ఆలయాలు ధూప దీప నైవేద్య కార్యక్రమాలు నిరాటంకంగా నిర్వహించుకునేందుకు ప్రతి నెలా రూ.10,000 చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంపై అధికారులు దృష్టి పెట్టాలి,” అని సూచించారు.

సమావేశంలో CGF, DDNS నిధుల అమలు విధానం, కొత్తగా ప్రతిపాదిత ఆలయాల జాబితా, పనుల పురోగతి మరియు నిధుల వినియోగంపై విస్తృతంగా చర్చ జరిగింది.

అలాగే ప్రతి నెలా అభివృద్ధి పనులు పై నివేదిక సమర్పించాలని, ఆలయాల అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులు సమయపాలనతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

సమావేశానికి దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్, దేవాదాయ శాఖ అధికారులు , ఇంజినీరింగ్ విభాగం అధికారులు తదితరులు హాజరయ్యారు.