- దృఢమైన దేశసంకల్పానికి బలమైన భావిపౌరులే పునాదుల్లాంటి వారు.
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరులో భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా సెంటర్లో మంగళవారం ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 6.0 కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. క్లీన్‌నెస్, హెల్త్ అనే సమున్నత లక్ష్యాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం సైక్లింగ్ని ప్రారంభించి, క్రీడాకారులతో కలిసి సైక్లింగ్ చేసి వారిలో స్ఫూర్తిని నింపారు. తదుపరి ఫ్రిడమ్ రన్‌ను కూడా ప్రారంభించారు. ఇదేసమయంలో సెంటర్ భవంతి అభివృద్ధిపై స్పందించిన ఎమ్మెల్యే చంటి.. సంబంధిత మంత్రితో పాటూ ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ…
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిఒక్కరూ దృఢత్వానికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రతిఒక్కరి ఫిట్‌నెస్‌కు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్దవహించాలని ఎమ్మెల్యే సూచించారు. అప్పుడే ఫిట్ ఇండియా లక్ష్యసాధన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటి డైరెక్టర్ గుర్నామ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బడేటి వెంకట రామయ్య, డిఎస్డివో అజీజ్, అసిస్టెంట్ వెయిట్ లిఫ్టింగ్ కోచ్‌లు వి. ఉదయ్ సందీప్, సుభంగి కరన్డే, దేవర్తి దాకన్ తదితరులు పాల్గొన్నారు.

