The Desk…Eluru : ఏపీ ఆక్వా పరిశ్రమతో కలిసి పనిచేయండి. “నార్వే సీఫుడ్ కౌన్సిల్” సభ్యులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆహ్వానం

The Desk…Eluru : ఏపీ ఆక్వా పరిశ్రమతో కలిసి పనిచేయండి. “నార్వే సీఫుడ్ కౌన్సిల్” సభ్యులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆహ్వానం

  • “నార్వే సీఫుడ్ కౌన్సిల్” ప్రధాన కార్యాలయం సందర్శన.

🔴 ఏలూరు/ట్రోంసో-నార్వే : ది డెస్క్ :

నార్వే పర్యటనలో ఉన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ట్రోంసో లోని “నార్వే సీఫుడ్ కౌన్సిల్” ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. నార్వే లో ఆక్వా రంగం అభివృద్ధి, సముద్ర ఆధారిత ఉత్పత్తుల వాణిజ్యం లాభదాయకంగా నడిపిస్తున్న తీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మార్కెట్లలో నార్వేజియన్ సముద్ర ఆహార విలువను పెంచడానికి ఆక్వా పరిశ్రమలతో కలిసి కౌన్సిల్ పనిచేస్తున్న విధానాన్ని ఆసక్తిగా విన్న ఏలూరు ఎంపీ, భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని, దీనిపై తన పర్యటనలో దృష్టి పెట్టాలని మంత్రి నారా లోకేష్ చెప్పిన విషయాన్ని నార్వే అధికారులకు తెలియచేసారు.

1053 కిలోమీటర్లతో దేశంలోనే అత్యధిక తీర ప్రాంతం కలిగిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఆక్వా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కౌన్సిల్ సభ్యులతో చర్చించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఆంధ్రప్రదేశ్ ను కూడా సందర్శించవలసిందిగా “నార్వే సీఫుడ్ కౌన్సిల్” సభ్యులను ఎంపీ ఆహ్వానించారు.

‎అంతకు ముందు ఆర్కిటిక్ కౌన్సిల్ కార్యాలయాన్ని, నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్ ను భారత ఎంపీల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా మత్స్య, మైనింగ్, సముద్ర రవాణా, పెట్రోలియం వంటి రంగాలలో సమగ్ర వనరుల నిర్వహణ, వాతావరణ మార్పులపై పరిశోధన, పర్యవేక్షణ జరుగుతున్న తీరును ఆర్కిటిక్ కౌన్సిల్ డైరెక్టర్ మాథ్యూ పార్కర్ భారత బృందానికి వివరించారు.

‎గురువారం సాయంత్రం ట్రోంసోలోని  ఫిన్‌మార్క్ కౌంటీలోని కారజోహ్కా గ్రామంలో ఉన్న “సామీ పార్లమెంట్” ను సందర్శించారు. నార్వేలోని సామీ వారసత్వం కలిగిన ప్రజలకు ప్రతినిధిగా ఉంటూ, సామీ ప్రజల కోసం సాంస్కృతిక స్వయంప్రతిపత్తి సంస్థగా పనిచేస్తున్న తీరును అక్కడి అధికారులు  భారత ప్రతినిధి బృందానికి వివరించారు.