🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడం ద్వారా యువత తమ భవిష్యత్తును బంగారు మయం చేసుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హితవు పలికారు. ఏలూరు అశోక్ నగర్ లోని కే. పి. డి. టి హైస్కూల్ ఆడిటోరియంలో ఎమ్మెల్యే బడేటి చంటి సహకారంతో నియోజకవర్గంలో యువతీ యువకులకు బుధవారం భారీ జాబ్ మేళా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో యువతీ యువకులు ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాధికారి జితేందర్ బాబు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ…
నిరుద్యోగ యువతకు దిశా నిర్దేశం చేసి..కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దీనిలో భాగంగా ప్రైవేట్ కంపెనీలను కూడా భాగస్వామ్యం చేస్తూ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో యువత ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. యువతీ యువకులు అంది వచ్చిన అవకాశాలను ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటూ వాటి ద్వారా జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ముందడుగు వేయాలని ఆయన సూచించారు.
ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ..
దాదాపు 19 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. దాదాపు నియోజకవర్గ పరిధిలోని 232 మంది యువత వివిధ కొలువులకు ఎంపిక అవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాకు వచ్చిన అభ్యర్థులకు ఎమ్మెల్యే బడేటి చంటి భోజన వసతి ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో జిల్లా ప్లేస్మెంట్ అధికారి కే. ప్రవీణ్, ఈడ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఏంసి చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, మాజీ చైర్మన్ పూజారి నిరంజన్, టిడిపి ఏలూరు నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు నెర్సు గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

