ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాలపై కైకలూరులోని ఓరియంటల్ హై స్కూల్ లో కైకలూరు టౌన్ పోలీసులు విద్యార్థినీ, విద్యార్థులకు సైబర్ నేరాలు, పోక్సో, ర్యాగింగ్ మరియు మైనర్ డ్రైవింగ్ వంటి అంశాలపై సమగ్ర అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కైకలూరు టౌన్ ఇన్‌స్పెక్టర్ ఏ. వి. ఎస్. రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాస్ వారి సిబ్బంది నిర్వహించారు.

సదస్సులో కైకలూరు టౌన్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాల సాధన కొరకు చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. మీరు 20 సంవత్సరాలు పాటు తల వంచి శ్రద్ధగా చదువుకుంటే, మిగిలిన 80 సంవత్సరాలు పాటు సుఖంగా, గౌరవంగా జీవించగలుగుతారన్నారు.

అదేవిధంగా సైబర్ నేరాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎదురవుతున్న ముఖ్యమైన సైబర్ నేరాల గురించి ఇన్‌స్పెక్టర్ వివరించారు. ఆన్ లైన్‌లో వచ్చే ఉద్యోగ ప్రకటనలకు మోసపోకుండా, నిరుద్యోగులు సంస్థల వెబ్ సైట్ చిరునామా (URL) తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. (ఉదా: RBI ఉద్యోగాల పేరుతో మోసపోయిన కేసులు). ఏటీఎం కార్డు క్లోనింగ్, లేదా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి ఖాతా/ఏటీఎం పిన్ నంబర్ సేకరించి డబ్బు మాయం చేసే ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఇద్దరు మధ్య స్నేహం విఫలమైనప్పుడు, గతంలో పంచుకున్న వ్యక్తిగత ఫోటోలను ఉపయోగించి వేధించడం ఇటీవల ఎక్కువైందన్నారు. అపరిచితుల అందమైన ఫోటోలతో తెరిచే ఫేస్ బుక్ అకౌంట్లతో మోసపోవద్దని హెచ్చరించారు. ఆన్ లైన్‌లో డిస్కౌంట్ ధరలకు వస్తువులు వస్తున్నాయని ఆశపడి డబ్బు చెల్లించి మోసపోవద్దు. వస్తువుల నాణ్యతను చూసి దుకాణాల్లో కొనుగోలు చేయడం మంచిది.
విద్యార్థులు కోపంతో ఇతరుల ఫోన్ నెంబర్ లను కాల్ గర్ల్స్ వెబ్ సైట్ లలో పెడుతున్న కేసులు కూడా ఉన్నాయని.. ఇలాంటి చర్యల వలన యువతులు, యువకులు కూడా బాధితులు అవుతున్నారని.. అపరిచితులకు నెంబర్ లు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్క్‌లను కేవలం అవసరం మేరకే వాడాలని.. వ్యక్తిగత ఫోటోలు, సమాచారం పోస్ట్ చేయకుండా కేవలం సమాచార సేకరణకు మాత్రమే ఇంటర్నెట్ ను ఉపయోగించాలని సూచించారు.
ర్యాగింగ్ & మైనర్ డ్రైవింగ్ : మైనర్‌లు (18 ఏళ్ల లోపు) ద్విచక్ర వాహనం కానీ, ఇతర వాహనాలు కానీ నడపరాదని, దీనికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై అలాగే వారి తల్లిదండ్రులపై కూడా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
హైస్కూల్/కాలేజీల్లో ర్యాగింగ్ కు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని.. దీని వలన మీ బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని.. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలను కోల్పోతారని విద్యార్థులకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.
సరదాగా మొదలైన ర్యాగింగ్ ఎదుటి వారికి ప్రాణహాని కలిగించేలా తయారవుతుందని ఆయన వివరించారు. అవగాహన సదస్సులో పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, ఎస్‌ఐ శ్రీనివాస్ స్వయంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు.

