🔴 ఏలూరు : నార్వే /ఓస్లో : ది డెస్క్ :
2025 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో అద్భుత విజయం సాధించి, ట్రోఫీ గెలుచుకున్న భారత మహిళా క్రికెట్ జట్టుకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభినందనలు తెలిపారు. భారత ప్రభుత్వం తరపున నార్వే పర్యటనలో ఉన్న ఏలూరు ఎంపీ, అక్కడి నుంచే ఒక ప్రకటన విడుదల చేశారు.
భారత మహిళా క్రికెట్ కు ఇది సువర్ణాధ్యాయమని, ప్రతి భారతీయుడు గర్వపడేలా ఆడి, వన్డే వరల్డ్ కప్ గెలవడం ద్వారా మన మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టించారని ఎంపీ వ్యాఖ్యానించారు. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుని పట్టుదలతో ఆడారని, జట్టులోని ప్రతి ఒక్కరూ విజయం కోసం చివరి వరకు అద్భుతంగా పోరాడారని ఎంపీ కితాబిచ్చారు.
ఈ సందర్భంగా టీం కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ కు, ఫైనల్ లో జట్టు విజయంలో కీలకపాత్ర వహించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న షెఫాలి వర్మకు, టోర్నమెంటు మొత్తంగా అద్భుత ప్రతిభ కనపరచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన దీప్తి శర్మకు, సెమీ ఫైనల్లో సూపర్ సెంచరీతో జట్టును ఫైనల్ కు చేర్చిన జెమీమా రోడ్రిగ్స్ కు ఎంపీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
భవిష్యత్తులో క్రికెటర్లుగా ఎదగాలనుకునే ఎంతో మంది మహిళ క్రీడాకారిణులకు ఈ విజయం స్ఫూర్తినిస్తుందని ఇస్తుందని ఎంపీ అన్నారు. మన మహిళా క్రికెట్ టీమ్ కేవలం ట్రోఫీనే కాదు, కోట్లాది ప్రజలు హృదయాలను గెలుచుకుందని, ప్రతి భారతీయుడు వీరిని చూసి గర్విస్తున్నారని చెబుతూ, భారత మహిళా క్రికెట్ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

