- ఈ నెల 2- 8 వరకు నార్వేలో పర్యటించనున్న భారత ఎంపీల బృందం.
- లింగ సమానత్వంపై “నాలెడ్జ్ ఎక్చేంజ్” ప్రోగ్రాం
- EFTA దేశాలతో వాణిజ్యం పెరుగుదలకు దోహదం.
🔴 ఏలూరు/ఢిల్లీ/ఓస్లో : ది డెస్క్ :
వారం రోజుల అధికారిక పర్యటన కోసం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నార్వే రాజధాని ఓస్లో చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఓస్లో గార్డెర్మోన్ విమానాశ్రయం (OSL) కు చేరుకున్న భారత ఎంపీల బృందానికి నార్వే ప్రభుత్వ ప్రతినిధులు, ఎంబసీ అధికారులు స్వాగతం పలికారు.
లింగ సమానత్వం, మహిళా సాధికారతపై ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో నార్వే ప్రభుత్వ సహకారంతో, ఆ దేశ రాజధాని ఓస్లో, ట్రోంసో నగరాల్లో నవంబర్ 2నుంచి 8వరకూ జరగబోయే సదస్సులు, నార్వే ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హాజరవుతున్నారు.
ఈ పర్యటన కోసం భారతదేశం తరపున ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఏడుగురు ఎంపీల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. “నాలెడ్జ్ ఎక్చేంజ్” ప్రోగ్రాంలో భాగంగా జరిగే ఈ పర్యటనలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా భారత ప్రతినిధి బృందం వారం రోజులపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననుంది.
ప్రపంచంలోనే లింగ సమానత్వం ఎక్కువగా ఉన్న దేశాల్లో నార్వే ఒకటి అనేది తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా నార్వే పార్లమెంట్ తో పాటు, వివిధ ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యే భారత ఎంపీల బృందం ఆ దేశంలో లింగ సమానత్వం, మహిళ సాధికారత అమలవుతున్న తీరును పరిశీలించనుంది. వీటితో పాటు ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెంపునకు సంబంధించి కూడా చర్చలు జరగనున్నాయి.

