The Desk…Machilipatnam : బందరు శ్రీ పాండురంగ స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి కొల్లు

The Desk…Machilipatnam : బందరు శ్రీ పాండురంగ స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి కొల్లు

  • నేటి నుండి చిలకలపూడి శ్రీ పాండురంగని ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

పండరీపురం తర్వాత దక్షిణ భారత దేశంలోనే మచిలీపట్నం కు ఎంతో ప్రాముఖ్యత ఉందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం నగరంలోని చిలకలపూడిలో స్వయంభువుగా వెలసిన శ్రీ పాండురంగ స్వామి వారికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సతీసమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. 1929 వ సంవత్సరంలో భక్త నరసింహులు, స్వామి వారిని ప్రసన్నం చేసుకుని అప్పటినుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్నారు.

దాదాపు 50 సంవత్సరాల క్రితం రథయాత్రను ఆపివేయడం జరిగిందని, 2014 సంవత్సరంలో తిరిగి మళ్ళీ రథయాత్రను ప్రారంభించామన్నారు. బందరు పరిసర ప్రాంత ప్రజలే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారన్నారు.

ఈరోజు శుక్రవారం కార్తీక శుద్ధ దశమి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయన్నారు. వచ్చే నవంబర్ 5వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. నవంబర్ 1 వ తేదీన స్వామి వారి కళ్యాgణం, 2 వ తేదీన స్వామివారికి రథోత్సవము, 3 వ తేదీన స్వామివారి తెప్పోత్సవం శివగంగా కాలేకాన్ పేటలో జరుగుతుందన్నారు.

4 వ తేదీన రుక్మిణి అమ్మవారి కుంకుమార్చన, సాంస్కృతిక కార్యక్రమాలు, 5 వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా పల్లకి ఉత్సవము, సముద్ర స్నానాలు పెద్ద ఎత్తున భక్తులు స్నానం ఆచరిస్తారన్నారు.

ఆరోజున సముద్ర స్థానం వద్ద గాని, దేవాలయంలో గాని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. మంగినపూడి బీచ్ లో ఉదయం సముద్రునికి హారతి కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.

మునిసిపల్, రెవిన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులు అందరూ సమన్వయంతో పిల్లలకు, వృద్ధులకు, మహిళలకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు సజావుగా చేస్తామన్నారు.

ప్రజలు ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామి వారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని మంత్రివర్యులు కోరారు.

కార్యక్రమంలో మంత్రి వెంట రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, సిటీ బ్యాంకు చైర్మన్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, స్థానిక నాయకులు సుబ్రహ్మణ్యం, ఫణి కుమార్ తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.