The Desk…Nellore : మన జాతి వైభవానికి ఆలయాలు మూలాధారాలు

The Desk…Nellore : మన జాతి వైభవానికి ఆలయాలు మూలాధారాలు

  • సుందరీకరణ పేరుతో ఆలయాల ప్రాచీనత దెబ్బతినకూడదు
  • పెద్దల వారసత్వ పరంపరను కొనసాగించాలి
  • పునర్నిర్మాణంతో వేణుగోపాలస్వామి ఆలయ పూర్వవైభవం

➖ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌ స్వామి అనుగ్రహభాషణం

  • దేవాదాయశాఖ మంత్రిగా ఆనం సంకల్పం గొప్పదని వ్యాఖ్య
  • అంగరంగం వైభవంగా వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం

🔴 నెల్లూరు : ది డెస్క్ :

మన జాతి వైభవానికి ఆలయాలు మూలాధారాలు.. పురాతన ఆలయాల ప్రాచీన చరిత్రను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పరమహంస, పరివ్రాజకాచార్యులు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌ స్వామి అనుగ్రహభాషణం చేశారు.

బుధవారం ఉదయం నెల్లూరు మూలాపేటలోని రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవం చిన్నజీయరు స్వామి వారి స్వహస్తములతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత హోమశాలలో ప్రత్యేక పూజల అనంతరం వేణుగోపాలస్వామి, ఉప ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

భక్తుల గోవిందనామస్మరణలతో, వేద మంత్రోచ్ఛరణలు, అచెంచలమైన భక్తివిశ్వాసాలతో ఆలయ శంకుస్థాపన మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌సెక్రటరీ హరిజవహర్‌లాల్‌, జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, ఆలయ ట్రస్టుబోర్డు సభ్యులు, ప్రముఖులు, భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విచ్చేసిన భక్తజనాన్ని ఉద్దేశించి చిన్నజీయరు స్వామి అనుగ్రహభాషణం చేశారు. చిత్తశుద్ధి, మంచి సంకల్పం ఉంటే భగవంతుడు మన వెంట ఉంటాడు అనేందుకు ఈరోజు జరిగిన ఈ గొప్ప కార్యక్రమమే మంచి ఉదాహరణగా చిన్నజీయరు స్వామి ఉదహరించారు.

ఒక పక్క భయంకరమైన తుపాను వల్ల ఈ కార్యక్రమంపై అనేక సందేహాలు వచ్చాయని, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంకల్పం, భగవంతుడి కార్యక్రమం మంచిగా జరగాలనే అందరి తపన, చిత్తశుద్దితోనే తుపాన్‌ గండం తొలగి దిగ్విజయంగా కార్యక్రమాన్ని భగవంతుడు చేయించాడని చెప్పారు. చిత్తశుద్ధి, మంచి సంకల్పానికి అంత శక్తి ఉంటుందని భక్తులకు ఉపదేశించారు.

తెలుగుజాతి చరిత్ర చాలా గొప్పది : చిన్నజీయరు స్వామి

భారతదేశం మొత్తం మీద తెలుగువారికి ఉన్న చరిత్ర మరెవ్వరికీ లేదని చిన్నజీయరు స్వామి అన్నారు. ఆహారంలోనూ..విహారంలోనూ..వ్యవహారంలోనూ తెలుగువాడి చరిత్ర గొప్పదన్నారు. తమిళనాడులోని శ్రీరంగం, మధురై పురాతన ఆలయాల్లో ఇప్పటికీ మన తెలుగులిపి కనిపిస్తుందన్నారు. మన చరిత్రను మనం సంరక్షించుకోవాలన్నారు. తెలుగువారి చరిత్రకు ఆలయాలే మూలాధామన్నారు.

ఆలయాల సుందరీకరణ తప్పు కాదని, అయితే ఆలయాల ప్రాచీనత దెబ్బతినకూడదన్నారు. ఆలయాల చరిత్ర కనుమరుగు కాకుండా ఆలయాల పునర్నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. పురాతన శిలాశాసనాలు, శిలాఫలకాలు, వస్తుసామగ్రిని అలాగే ఉంచి మన చరిత్రకు సాక్ష్యాలుగా రేపటి తరాలకు అందించాలన్నారు.పూర్వీకులు మనకు అందించిన వేల సంవత్సరాల చరిత్ర పరంపరను కొనసాగిస్తూ ఆలయాలకు వైభవం తీసుకురావాలని సూచించారు.

వేణుగోపాలస్వామి ఆలయ పూర్వవైభవంలో అందరూ భాగస్వామ్యులు కావాలి : చిన్నజీయరుస్వామి

ఎంతో గొప్ప ప్రాశస్త్యం గల వేణుగోపాలస్వామి ఆలయానికి గత పూర్వవైభవం తీసుకొచ్చేందకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయశాఖ అధికారులు ఎంతో కృషి చేస్తున్నారని, భక్తులు కూడా ఈ మహత్కార్యంలో భాగస్వాములు కావాలని చిన్న జీయర్ స్వామి పిలుపునిచ్చారు.

ఐదు కుటుంబాల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న ట్రస్టుబోర్డు సభ్యులు ఆలయ పవిత్రతను కాపాడాలనే సంకల్పంతో పెద్దల వారసత్వాన్ని కొనసాగించాలనే ఆలోచన చేయడం సంతోషకరమన్నారు.

నెల్లూరు శాసనసభ్యులు దివంగత ఆనం వివేకానందరెడ్డి పెద్ద కుమారుడు ఆనం చెంచు సుబ్బారెడ్డి కూడా ట్రస్టుబోర్డులో సభ్యుడిగా చేరడంతో ట్రస్టుబోర్డుకు పరిపూర్ణత చేకూరిందన్నారు. ట్రస్టుబోర్డు సభ్యులు, అర్చకులు ఆలయ అభివృద్ధిలో కీలక భూమిక పోషించాలన్నారు.

18నెలల్లోనే ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి

చిన్నజీయరు స్వామి వారి ఆశీస్సులతో ఆలయ పునర్నిర్మాణం

ఆలయంలోని శిలఫలకాలకు సముచిత గౌరవంతో తిరిగి ఏర్పాటుచేస్తాం

ట్రస్టుబోర్డులోకి ఆనం వివేకానందరెడ్డి పెద్ద కుమారుడు ఆనం చెంచుసుబ్బారెడ్డి

➖రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ:

రాష్ట్రంలో ఉన్న 27వేల ఆలయాల బాధ్యతను సీఎం చంద్రబాబు నాయుడు తనపై నమ్మకంతో అప్పగించారని, ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఆలయాల అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు చెప్పారు. ఎంతో చరిత్ర, ప్రాశస్త్యం గల వేణుగోపాలస్వామి ఆలయంలో గతంలో వందలాది కల్యాణాలు జరిగేవని, భక్తులతో ఆలయం కళకళలాడేదని మంత్రి గుర్తుచేశారు.

అయితే కాలక్రమంగా ఆలయ శక్తి తగ్గడంతో చిన్నజీయరు స్వామి వారి సూచనల మేరకు ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. రాష్ట్రప్రభుత్వం 17 కోట్ల నిధులను మంజూరుచేసినట్లు చెప్పారు. ఆలయ పవిత్రత దెబ్బతినకుండా ఖర్చుకు వెనకాడకుండా ఆలయ గర్భాలయం, అంతరాలయం, రాజగోపురం, అన్వేటి మండపం నిర్మాణాలను రాతి కట్టడాలతోనే నిర్మిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆలయాల పునర్నిర్మాణాలను రాతికట్టడాలతోనే నిర్మిస్తామని, ఇందుకు వేణుగోపాలస్వామి ఆలయం నుంచే శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి చెప్పారు. వేణుగోపాలస్వామి ఆలయం నుంచే దళితుల ప్రవేశం జరిగిందన్న మంత్రి, ఆనాటి జ్ఞాపకాలను, ఆలయంలో ఉన్న పురాతన శిలాఫలకాలను సముచిత గౌరవంతో తిరిగి ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఐదుగురు సభ్యులతో ట్రస్టుబోర్డు ఉండాల్సి ఉండగా, ఒక స్థానంగా ఖాళీగా ఉండడంతో ఆనం వివేకానందరెడ్డి పెద్దకుమారుడు ఆనం చెంచుసుబ్బారెడ్డి ట్రస్ట్ సభ్యుడుగా నేడు ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించినట్లు మంత్రి చెప్పారు. ఆలయ నిర్మాణానికి రెండేళ్లు కాలం ఉన్నప్పటికీ 18నెలల్లోనే అద్భుతంగా నిర్మాణాలను పూర్తి చేసి ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను కోరినట్లు చెప్పారు.

ఆలయ నిర్మాణం పూర్తయిన వెంటనే మహాకుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను కూడా చిన్నజీయరు స్వామి వారి స్వహస్తములతో నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. సర్వాంగ సుందరంగా ప్రాచీన వైభవానికి తగినట్లుగా వేణుగోపాల స్వామి ఆలయాన్ని పునర్నిర్మించేందుకు దేవాదాయ శాఖ కృషి చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.

తొలుత వేణుగోపాలస్వామి ఆలయ విశిష్టతపై రూపొందించిన పుస్తకాన్ని చిన్న జీయర్ స్వామి ఆవిష్కరించారు.

కార్యక్రమంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, ఆలయ ట్రస్టుబోర్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.