The Desk…Kaikaluru : తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన

The Desk…Kaikaluru : తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన

  • ‎తుఫాన్ పరిస్థితులపై ప్రభుత్వం, అధికారులు అప్రమత్తం
  • పునరావాస కేంద్రాల వద్ద ఆహారం, వైద్య సౌకర్యాలు.

➖(MP)మహేష్ పుట్టా.

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

ఏలూరు జిల్లాలోన తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటించారు. ఉదయం జోరువానలోనే కొల్లేరు బయలుదేరిన ఎంపీ, కైకలూరు సమీపంలో మాదేపల్లి గ్రామంలో పంట పొలాల వద్ద రైతులతో మాట్లాడారు.

కొల్లేరు సమీపంలో చెరువుల వద్ద ఆక్వా రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. కైకలూరు నుంచి ఉప్పుటేరు బ్రిడ్జి వద్దకు చేరుకున్న ఎంపీ ఉప్పుటేరు నీటి ఉధృతిని పరిశీలించారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఉండి ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తో కలిసి ఉప్పుటేరు ప్రాంతాన్ని పరిశీలించారు.

సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ..

తుఫాన్ పరిస్థితులపై ప్రభుత్వం, అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, ఎటువంటి ప్రాణ నష్టం జరక్కుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ నిరంతరం పరిస్థితులను సమీక్షిస్తున్నారని, ప్రజా ప్రతినిధులంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండి, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఆహారం, అత్యవసర వైద్యం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

పునరావస కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ :

అనంతరం అక్కడినుంచి కైకలూరు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రాన్ని సందర్శించి, వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.  పునరావాసం పొందుతున్న వ్యక్తులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.

కార్యకర్తలకు దిశా నిర్దేశం :

సాయంత్రం ముదినేపల్లి మండలం పెనుమల్లి గ్రామంలో కూటమి పార్టీల కార్యకర్తలతో భేటీలో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తుఫాను సహాయ చర్యల్లో పాల్గొనాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఎమర్జెన్సీ :

అత్యవసరం అయితే ఏలూరు కలెక్టరేట్ వద్ద కంట్రోల్ రూమ్ నెంబర్ 1800-233-1077, 94910 41419 ఫోన్ నెంబర్ల లేదా ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయ నంబర్స్ +91 96181 94377, +91 98855 19299 కు ఎవరైనా కాల్ చేయవచ్చని ఎంపీ  పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.