సెల్ టవర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలి –– జిల్లా కలెక్టర్
కృష్ణా జిల్లా : చల్లపల్లి: ది డెస్క్ :
ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మోంతా తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, సమాచార వ్యవస్థకు సంబంధించిన సెల్ టవర్ల సక్రమ నిర్వహణకు అవసరమైన పవర్ బ్యాక్అప్, జనరేటర్లు, డీజిల్ ఇంధనం సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ చల్లపల్లి మండలంలోని రామానగరం, చల్లపల్లిలో బిఎస్ఎన్ఎల్, జియో టవర్లను సందర్శించి పరిశీలించారు. రామానగరంలోని బిఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజిలో ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్ను సందర్శించి కండిషన్ ను సాంకేతిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బ్యాటరీ పవర్ బ్యాకప్ గురించి ఆరా తీసి, అది ఎంత సమయం వరకు వస్తుందని, అదేవిధంగా జనరేటర్ సక్రమంగానే పనిచేస్తుందా అని, అవసరమైన డీజిల్ ఇంధనాన్ని సిద్ధంగా ఉంచుకున్నారా అని కలెక్టర్ అడిగారు.
బ్యాటరీ పవర్ బ్యాక్అప్ ఆరు గంటల వరకు వస్తుందని, జనరేటర్ మంచి కండిషన్ లోనే ఉందని చెబుతూ ప్రస్తుతం 150 లీటర్ల డీజిల్ ఇంధనాన్ని సిద్ధంగా ఉంచుకున్నట్లు కలెక్టర్కు తెలిపారు. చల్లపల్లి డివిజన్లో బిఎస్ఎన్ఎల్ తోపాటు నాన్ బిఎస్ఎన్ఎల్ టవర్లు కలిపి మొత్తం 26 వరకు ఉన్నాయని ఆయనకు తెలిపారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ జనరేటర్ పనితీరును పరిశీలించేందుకు దానిని స్టార్ట్ చేయించి పరిశీలించారు.
కండిషన్ బాగానే ఉందని, ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందస్తుగానే మరింత డీజిల్ ఇంధనాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. అనంతరం ఆయన చల్లపల్లి తహసిల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమై చల్లపల్లి డివిజన్లో సెల్ టవర్ల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
చల్లపల్లి మండల ప్రత్యేక అధికారి, జడ్పీ డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, చల్లపల్లి బిఎస్ఎన్ఎల్ జేఈ బి వెంకట రమణ, తదితరు అధికారులు కలెక్టర్ తో పాటు ఉన్నారు.

