కృష్ణా జిల్లా : మచిలీపట్నం కలెక్టరేట్ : ది డెస్క్ :
రొయ్యల సాగులో సాంప్రదాయ పద్ధతులకు బదులుగా శాస్త్రీయ విధానాలను అనుసరించండం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని, ఆ దిశగా ఆలోచన చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులకు సూచించారు.
శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జిల్లాలోని ఆక్వా రైతులకు బయో రాస్ శాస్త్రీయ విధానంలో చేపట్టే రొయ్యల సాగు విధానంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో జేమ్స్ కుక్ సింగపూర్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, శాస్త్రవేత్త డాక్టర్ జోస్ డోమింగోస్ బయో రాస్ శాస్త్రీయ విధానంలో చేపట్టే రొయ్యల సాగు విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కలిగించారు.
ఈ విధానంలో ఇప్పటికే సాగును చేపట్టిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గంటా సాయిరాం అనే రైతు తన స్వానుభవాలను ఇతర రైతులతో ఈ సందర్భంగా పంచుకున్నారు. బయో రాస్ శాస్త్రీయ విధానంలో గంటా సాయిరాం చేపట్టిన సాగును సందర్శించి మెళకువలు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ రైతులకు ఈ సందర్భంగా సూచించారు.
కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వంటి పథకాలతో ఆర్థిక సహకారం అందిస్తుందని, ఆసక్తిగల రైతులు ముందుకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మత్స శాఖాధికారి అయ్యా నాగరాజా, మత్స్య అభివృద్ధి అధికారులు, ఆక్వా రైతులు తదితరులు పాల్గొన్నారు.