The Desk…Machilipatnam : సౌర విద్యుత్ వినియోగించండి … వాయు కాలుష్యాన్ని తగ్గించండి –– జిల్లా ప్రజలకు కలెక్టర్ డీకే బాలాజీ పిలుపు

The Desk…Machilipatnam : సౌర విద్యుత్ వినియోగించండి … వాయు కాలుష్యాన్ని తగ్గించండి –– జిల్లా ప్రజలకు కలెక్టర్ డీకే బాలాజీ పిలుపు

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

గృహాలపై సౌర శక్తి ఫలకాలను ఏర్పాటు చేసుకొని సౌర విద్యుత్ వినియోగిస్తూ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు.

శనివారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టరేట్ ప్రధాన ద్వారం నుండి సాయిబాబా గుడి వరకు ప్రధానమంత్రి-సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం వినియోగంపై నగర ప్రజలకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి సౌరశక్తి.. సుస్థిర భారత్ కు బాట, పర్యావరణ రక్షణకు.. సౌర శక్తి మన కర్తవ్యం అంటూ పలు నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గృహాలపై సౌర శక్తి ఫలకాల ఏర్పాటుతో సొంతంగా వినియోగదారులే విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవచ్చని, పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ .78 వేల వరకు ఇస్తున్న సబ్సిడీ రాయితీలను పొందడమేకాకుండా, బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. దీనికి వివిధ బ్యాంకులు ఋణ సౌకర్యం కల్పిస్తున్నాయని తెలిపారు. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గృహాలకు సరఫరా అవుతున్న విద్యుత్ చాలా వరకు థర్మల్ పవర్ విద్యుత్ ద్వారా వస్తోందని, అందుకు బొగ్గును కాల్చడం ద్వారా ఉత్పత్తి అవుతుందని, దీనివల్ల వాయు కాలుష్యం పెరుగుతుందన్నారు.

ఈ నేపథ్యంలో సౌర విద్యుత్తును వినియోగించడం ద్వారా వాయు కాలుష్యం తగ్గించడంలో కృషి చేసిన వాళ్ళు అవుతారని, ఆ దిశగా ప్రజలందరూ సౌర విద్యుత్ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ర్యాలీలో జిల్లా కలెక్టర్ తో పాటు విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.