- జడ్పీ కన్వెన్షన్ ఆవరణలో వారం రోజుల పాటు బందర్ బొనాంజా షాపింగ్ ఫెస్టివల్..
- ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తదితరులతో కలిసి షాపింగ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన మంత్రి
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, ప్రజల ఆదాయం పెరిగిందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాలలో భాగంగా సోమవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బందర్ బొనాంజా షాపింగ్ ఫెస్టివల్ ను మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తదితరులతో కలిసి షాపింగ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు.
అనంతరం మంత్రి, కన్వెన్షన్ హాల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, అదేవిధంగా ఆఫ్కో, కలంకారి వస్త్రాలు, వ్యవసాయ డ్రోన్లు, పిచికారి యంత్రాలు, ఔషధాలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, టెలివిజన్లు, వాషింగ్ మిషన్లు, స్టేషనరీ, హెల్త్ ఇన్సూరెన్స్, నిత్యవసర సరుకులు తదితర స్టాళ్లను వారు సందర్శించి, ఆయా వస్తువులు గతంలోని ధరలకు, ఇటీవల జీఎస్టీ తగ్గింపుతో వచ్చిన ధరల వ్యత్యాసాలను అమ్మకందారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
కన్వెన్షన్ హాల్ వెలుపల వరి కోత యంత్రాలు, ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్ర వంటి వాహనాలు ప్రదర్శనగా ఉంచగా వాటిని సందర్శించి ధరల వివరాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జిఎస్టి) తగ్గించి ప్రజలకు పన్నుల భారం నుంచి ఉపశమనం కలిగించిందన్నారు. గతంలో కమర్షియల్, సెంట్రల్, స్టేట్, వ్యాట్ వంటి అనేక పన్నులు ఉండేవని, అయితే 2014లో ఒకే దేశం ఒకే పన్ను విధానంతో నాడు కేంద్ర ప్రభుత్వం జిఎస్టి అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు.
ఈ విధానంలో కేంద్ర ప్రభుత్వమే పన్నులను వసూలు చేసి రాష్ట్రాలకు వాటాలను పంపిణీ చేస్తుందని మంత్రి తెలిపారు. జీఎస్టీ విధానం వల్ల బ్లాక్ మార్కెట్ అరికట్టడం జరిగిందని, దానివల్ల దేశ ఆదాయం పెరిగిందన్నారు. పెరిగిన ఆదాయాన్ని ప్రజలకు పంచాలనే ఉద్దేశంతోనే జీఎస్టీ సంస్కరణలు చేపట్టి సూపర్ జిఎస్టితో సూపర్ సేవింగ్స్ అందించామన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నప్పటికీ అది ప్రజల ఆదాయంగా చేరిందన్నారు.
నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేయడం శుభపరిణామన్నారు. ఔషధాలపై 18 శాతం నుండి శాతానికి తగ్గింపు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల మందులపై 12 శాతం నుండి సున్నా శాతానికి జీఎస్టీ తగ్గింపు పేదలకు మరింత తోడుగా నిలుస్తుందన్నారు. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై 18 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దు చేయడం ప్రజల జీవన ప్రమాణాలను మరింతగా పెంచుతుందన్నారు. గతంలో లక్ష రూపాయల పాలసీ తీసుకుంటే రూ.18 వేలు ట్యాక్స్ పోయేది, ఇప్పుడు ఆ మొత్తమంతా ప్రజల చేతిలోనే మిగిలిపోతోందన్నారు.
వ్యవసాయ పరికరాలపై కూడా ఈ ప్రభావం భారీగా ఉంటుందన్నారు. ట్రాక్టర్లలో రూ.40 వేల నుండి రూ.80 వేల వరకు ఆదా అవుతుందని, డ్రోన్లపై రూ.10 లక్షల విలువ ఉన్నప్పుడు దాదాపు రూ.60 వేల వరకు తగ్గింపు లభిస్తోందన్నారు. ఏసీలు, ఫ్రిజ్‌లపై 10 శాతం వరకు ఆదా అవుతుందని తెలుపుతూ, కార్లపై జీఎస్టీని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గడంతో సామాన్యులకు సొంత కారు కల సులభతరం అవుతోందన్నారు.
జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలపై పట్టణ స్థాయి నుంచి గ్రామాల స్థాయి వరకు విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నామన్నారు. ఆ ప్రచారంలో భాగంగా జెడ్పీ కన్వెన్షన్ హాల్లో వారం రోజుల పాటు షాపింగ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసి ఏ వస్తువులపై ఎంతమేర ధరలు తగ్గాయని అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అక్టోబర్ 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వారం రోజులు పాటు ఈ షాపింగ్ ఫెస్టివల్ జరుగుతుందని, ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ప్రజలను కోరారు.
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏ ప్రభుత్వం పన్నులను తగ్గించి ప్రజల ఆదాయాన్ని పెంచిందని అన్నారు. ప్రపంచంలో పన్నులు తగ్గించిన దేశం భారతదేశం అని పేర్కొంటూ, దేశంలో మొట్టమొదటిసారిగా జిఎస్టి తగ్గించి వ్యవసాయ పనిముట్ల దగ్గర నుంచి బీమా వరకు ధరలు తగ్గించి ప్రజలకు ఎంతో మేలు చేశారని అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో దేశ ఆదాయం తగ్గినప్పటికీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ.. ప్రతి సామాన్యుడు ఆనందకరమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిఎస్టి తగ్గించి లబ్ధి చేకూర్చిందన్నారు. వాటి ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ అందాలనే లక్ష్యంతో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ద్వారా వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ క్రమంలో నగరంలో బందర్ బొనాంజా షాపింగ్ ఫెస్టివల్ కార్యక్రమం వారం రోజులు పాటు నిర్వహిస్తున్నామని తెలుపుతూ, తగ్గిన జిఎస్టి ధరల ప్రయోజనాన్ని పొందే విధంగా అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. జిఎస్టి ధరల తగ్గింపు ద్వారా ప్రజలు వస్తువుపై చేసే ఖర్చు తగ్గటంతో పాటు పొదుపు పెరుగుతుందని, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
కార్యక్రమంలో జీఎస్టీ ప్రచార కమిటీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కల్పన, అడిషనల్ కమిషనర్ బాబురావు, జడ్పీ సీఈవో కన్నమనాయుడు, డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, మెప్మా పీడీ సాయిబాబు, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తదితర కూటమి నాయకులు, వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

