The Desk…Machilipatnam : ధాన్యం సేకరణకు ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk…Machilipatnam : ధాన్యం సేకరణకు ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం కలెక్టరేట్ : ది డెస్క్ :

జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళిక బద్ధంగా ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి ధాన్యం సేకరణ పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గత సంవత్సరంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఖరీఫ్ కాలంలో చాలా జాగ్రత్తలు పాటించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరించాలని సూచించారు. ఇందుకోసం ముందుగానే ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏలు) చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు.గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా గ్రైతులందరికీ ధాన్యం సేకరణ పై వారు పెద్ద ఎత్తున అవగాహన కలిగించాలన్నారు.

గ్రామాల్లో వరి కోత స్థితిగతులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉన్నతాధికారులకు స్పష్టమైన సమాచారాన్ని చేరవేయాలన్నారు.జిల్లా కేంద్రంలో ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేసి దాన్యం సేకరణ సజావుగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. వరి ధాన్యం సేకరణ కేంద్రమైన రైతు సేవ కేంద్రాన్ని కాదని నేరుగా మిల్లర్ల దగ్గరికి పోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పంట చేతికి వచ్చిన వెంటనే రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకొని ట్రక్ షీట్ జనరేట్ చేసుకొన్న తర్వాతనే మిల్లర్ల దగ్గరికి పోవాలన్నారు.

మధ్య దళారులు అనవసరంగా జోక్యం చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమస్యలు సృష్టించే వారిపై అవసరమైతే క్రిమినల్ కేసులు బనాయించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు రైతులు ఎవరు అమ్మకుండా వారికి ధైర్యం చెప్పాలని సూచించారు. మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసే వారి పైన నిఘా ఉంచి రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో నియంత్రించాలన్నారు.

ఈ-పంట నమోదు 90 శాతం పూర్తయిందని, నూటికి నూరు శాతం సత్వరమే పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లర్లు, గ్రామ వ్యవసాయ సహాయకులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి ధాన్యం సేకరణ, తేమ శాతం కొలతలు తదితర అంశాలపై సంపూర్ణ అవగాహన కలిగించాలని సంయుక్త కలెక్టర్ కు సూచించారు.

జిల్లాలోని అన్ని మిల్లులను తనిఖీ చేసి తేమ శాతం కొలిచే యంత్రాలను పరిశీలించాలని, అన్ని ఒకే విధంగా కచ్చితత్వం, నాణ్యత ప్రమాణాలతో పని చేస్తున్నాయా లేదా గమనించాలన్నారు. ధాన్యం సేకరణకు వినియోగించే200 వాహనాలను సిద్ధం చేసి నమోదు చేశారని, ఇంకనూ మరిన్ని వాహనాలను వెంటనే నమోదు చేయించాలన్నారు.

జిల్లాలోని మిల్లర్ల సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. జిల్లాలోని మిల్లర్ల సామర్ధ్యానికి మించి ధాన్యం వస్తే ఇతర జిల్లాల మిల్లర్ల వద్దకు పంపేందుకు కూడా ముందుగానే ఏర్పాట్లు చేసుకుని సంసిద్ధంగా ఉండాలన్నారు.జిల్లాలో గోతం సంచుల కొరత ఎట్టి పరిస్థితులను రాకూడదని, కన్నం ఉన్న గోతాలను సజావుగా కుట్టించి రైతులకు సరఫరా చేయాలన్నారు.

మిల్లుల నుండి సీఎంఆర్ డెలివరీ పటిష్టంగా చేయాలని రొటేషన్ పద్ధతిలో పటిష్టంగా చేయాలని ఇందులో ఏమాత్రం జాప్యం చేయరాదన్నారు. ధాన్యం మూటలు రవాణాకు హమాలీల కొరత రాకుండా చూడాలన్నారు.ముఖ్యంగా పరిపక్వదశకు రాని వరి పంటను కోయకుండా రైతులను, యంత్రాల యజమానులను చైతన్య పరచాలన్నారు.

సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరాం ప్రసాద్, డీఎస్ఓ మోహన్ బాబు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, మార్కెటింగ్ ఏడి నిత్యానందం, డి సి ఓ చంద్రశేఖర్, జిల్లా రవాణా అధికారి ఎన్ శ్రీనివాసు, తూనికలు కొలతల శాఖ సహాయ నియంత్రణ అధికారి భాను ప్రసాదు, జిల్లా రైస్ మిల్లుల సంఘం అధ్యక్షులు పిన్నమనేని వీరయ్య, డిసిఎంఎస్ ప్రతినిధి శ్రీధర్, ఎఫ్ పి ఓ లు రత్న కిషోర్, సుజయ్ కుమార్ తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.