🔴 ఏలూరు/ కరూర్ : AP/TN : ది డెస్క్ :

తమిళనాడు కరూర్ లో టీవీకే పార్టీ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు ఆ పార్టీతోపాటు, ప్రభుత్వ వైఫల్యం కూడా స్పష్టంగా కనపడుతోందన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. తమిళనాడులోని కరూర్ లో టీవీకే పార్టీ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని 8 మంది సభ్యుల ఎన్డీఏ ఎంపీల బృందం పరిశీలించింది. ఈ బృందంలో సభ్యుడిగా ఉన్న ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అక్కడి నుంచే ఒక ప్రకటన విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ జాతీయ అధ్యక్షుని సూచనలమేరకు దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశామన్నారు. బాధితులను పరామర్శించినప్పుడు వారు చెప్పిన విషయాలు తమను ఎంతో ఆవేదనకు గురిచేశాయన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. మృతుల్లో మహిళలు, పిల్లలు, కొత్తగా పెళ్లైన జంటలు కూడా ఉండటం మనసును కలిచివేసిందన్నారు.

ఎన్డీయే ఎంపీల బృందానికి కన్వీనర్ గా వ్యవహరించిన హేమమాలిని, బృందంలోని మరో సభ్యుడు బీజేపి ఎంపీ అనురాగ్ ఠాకూర్ విలేఖరులతో మాట్లాడుతూ.. టీవీకే పార్టీ నేతలు ర్యాలీ నిర్వహణ సరిగా చేయలేకపోయారని, ప్రభుత్వ, పోలీసు వ్యవస్థ వైఫల్యం కూడా స్పష్టంగా కనపడుతోందన్నారు.
నివేదిక తయారు చేసి బీజేపీ జాతీయ అధ్యక్షునికి అందజేస్తామని ఎంపీల బృందానికి కన్వీనర్ గా వ్యవహరిస్తున్న హేమా మాలిని తెలిపారు.అంతకుముందు ఎంపీల బృందానికి కోయంబత్తూర్ ఎయిర్పోర్టులో తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్, మాజీ అధ్యక్షుడు అన్నామలై సాదర స్వాగతం పలికారు.

ముందుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఎన్డీయే ఎంపీల బృందం, అక్కడినుంచి కరూర్ లో ర్యాలీ జరిగిన ప్రదేశానికి వెళ్లి స్థానికులతో మాట్లాడి దుర్ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాలుగు బృందాలుగా విడిపోయిన ఎంపీల బృందం తొక్కిసలాటలో మృతి చెందిన ప్రతి ఒక్కరి ఇళ్లకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శోకసముద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, న్యాయం జరిగేట్లు చూస్తామని హామీ ఇచ్చారు.
కరూర్ పరిశీలనకు వెళ్ళిన ఎన్డీయే ఎంపీల బృందంలో కన్వీనర్ హేమా మాలినితో పాటు, బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, తేజస్వి సూర్య, బ్రజ్ లాల్, అప్రజిత సారంగి, రేఖా శర్మ, శివసేన ఎంపీ శ్రికాంత్ షిండే, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్ మరియు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అన్నామలై ఇతర ముఖ్య నేతలు పాల్గొనడం జరిగింది.