- ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి
కృష్ణా జిల్లా : మచిలీపట్నం కలెక్టరేట్ : ది డెస్క్ :
జిల్లాలో ఈ–పంట నమోదు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ తో కలిసి ఇటీవలి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో జిల్లాకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చించిన అంశాలు, సమస్యలపై చర్చ రెండవ రోజు కొనసాగింపుగా వివిధ శాఖల అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.
జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ–పంట నమోదు పూర్తి చేయాలన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించి రైతులు పంటను కోల్పోతే నష్టపరిహారం, పంట బీమా పొందేందుకు, ధాన్యం కొనుగోలు వంటి వాటికి ఈ–పంట నమోదు తప్పని సరి అయిన నేపథ్యంలో ఆలస్యం చేయకుండా గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అన్నదాత సుఖీభవ– పీఎం కిసాన్, తల్లికి వందనం పథకాల కింద నగదు జమ కాని లబ్ధిదారుల సాంకేతిక సమస్యలను పరిష్కరించాలన్నారు. బ్యాంక్ ఖాతాను తెరవటం, బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ అనుసంధానం చేయడంపై లబ్ధిదారులకు వివరించి చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.