- నాణ్యమైన వైద్యం, రోగుల సంతృప్తే ముఖ్యం
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ప్రభుత్వాసుపత్రి : ది డెస్క్ :

అర కొర సౌకర్యాలు, వైద్య పరికరాల కొరతతో ఇబ్బంది పడుతున్న ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి కొంత స్వాంతన చేకూరింది. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చొరవతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద గెయిల్ ఇండియా ద్వారా కోటి రూపాయల విలువైన వైద్య పరికరాలు సమకూరాయి.
వీటిని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించడంతో, అత్యవసర వైద్య పరికరాలు రోగులకు అందుబాటులోకి వచ్చాయి.ప్రభుత్వ ఆసుపత్రికి అందిన వైద్య సామగ్రిలో అనస్థీషియా వర్క్ స్టేషన్ (2), కార్డియోటోకోగ్రఫీ మెషిన్లు (2), కంప్యూటెడ్ రేడియోగ్రఫీ సిస్టమ్ (ఎక్స్రే క్యాసెట్ రీడర్), హెమటాలజీ అనలైజర్ (ఓపెన్ లూప్), ఆపరేషన్ థియేటర్ లైట్లు (10), ICE లైన్డ్ రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి.
గతంలో రెండు మూడు సార్లు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, సమస్యలపై ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఈ అత్యవసర వైద్య పరికరాలు లేకపోవడంతో పడుతున్న ఇబ్బందులను గమనించారు. ఎంపీ సూచనల మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఈ ఏడాది మార్చిలో గెయిల్ ఇండియాకు లేఖ రాశారు.
అంతటితో వదిలిపెట్టకుండా, సీఎస్ఆర్ కింద నిధులు కేటాయించి ఈ వైద్య పరికరాలు ఏర్పాటు చేయాల్సిందిగా గెయిల్ ఇండియాను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్వయంగా కోరడంతో సానుకూలంగా స్పందించిన ఆ సంస్థ నిధులు కేటాయించింది. గత శుక్రవారం ఈ ఎక్విప్మెంట్ ఆసుపత్రికి చేరాయి. వాటిని ఈరోజు రోగులకు అందుబాటులోకి తీసుకురావటం జరిగింది.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ .. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం ప్రధానమని, ప్రతి రోజూ వందలమంది పేద ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలపై ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారని, వారికి సరైన సౌకర్యాలతో ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుగా తమపై ఉందన్నారు.
అందులో భాగంగా, ఈరోజు కొన్ని వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకురాగలిగామని, ఆసుపత్రి అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానని, భవిష్యత్తులో మరిన్ని వసతుల కల్పనకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రికి రెండు అధునాతన అంబులెన్సులు కూడా కొద్ది రోజుల్లోనే అందిస్తామన్నారు. ఆసుపత్రి అభివృద్దే లక్ష్యంగా ఎమ్మెల్యే, కలెక్టర్, తాను కలిసికట్టుగా కృషి చేస్తున్నామని చెప్పారు.

రోగులను తమ కుటుంబ సభ్యులుగా భావించి, ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా మంచి వైద్యం అందించి వారిని ఆరోగ్యంగా, సంతృప్తిగా ఇంటికి పంపేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. సిఎస్ఆర్ కింద ప్రభుత్వ ఆసుపత్రికి కోటి విలువైన వైద్య పరికరాలు అందించడానికి కృషి చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఆసుపత్రి సూపర్నింటెండెంట్ కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే బడేటి రాధా కృష్ణయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్య దృష్టికి తీసుకువచ్చినా వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేసే యువ ఎంపీ ఇక్కడ ఉండటం ఏలూరు ప్రజల అదృష్టమని కొనియాడారు.
కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ.. ఆసుపత్రిలో పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ ఒక్కటొక్కటిగా పరిష్కరానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది కూడా తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి రోగులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి), కలెక్టర్ వెట్రి సెల్వి, గెయిల్ ఇండియా జీఎం నారాయణ, హెల్త్ కేర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి శరత్, ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.