The Desk…Eluru : ప్రతిరోజు కొంత సమయం  శ్రమదానం చేస్తే ఆరోగ్య వంతమైన, నవసమాజం ఏర్పడుతుంది

The Desk…Eluru : ప్రతిరోజు కొంత సమయం శ్రమదానం చేస్తే ఆరోగ్య వంతమైన, నవసమాజం ఏర్పడుతుంది

  • ప్రతి పండగ సంతోషాలు మధ్య పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
  • ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ పండుగలు ఆనందం రెట్టింపు అవుతాయి

ఏపి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ యండి బి.అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి …

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

స్థానిక పంపుల హెడ్ వాటరు వర్క్స్ వద్ద గురువారం “స్వచ్ఛతా హి సేవ – 2025” భాగంగా “ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్” అనే థీమ్‌తో ఏపి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ యండి బి.అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి సంయుక్తంగా మొక్కలు నాటి, చెత్తచెదారం వేరివేసి ప్రత్యేక శుభ్రతా డ్రైవ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సందర్భంగా ఏపి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ యండి బి.అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా జరుగుతున్న “స్వచ్ఛతా హి సేవ – 2025” కార్యక్రమంలో భాగంగా “ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్” అనే థీమ్‌తో పంపుల హెడ్ వాటరు వర్క్స్ లో అందరుకలిసి ప్రత్యేక శుభ్రతా డ్రైవ్‌లో పాల్గొనుట ప్రతి ఒక్కరిలో ఆలోచన, స్పూర్తి కలగడం ఏలూరు జిల్లాలో పాల్గొనుట నాకు ఎంతో సంతృప్తి కలిగిందన్నారు.

కనీసం రోజుకు కొంత సమయం కేటాయించి స్వచ్ఛందంగా ముందుకువచ్చి శ్రమదానంలో పాల్గొంటే ఆరోగ్యవంతమైన పట్టణాలు, గ్రామాలుగా కళకళ లాడతాయని అన్నారు. అనాడు పూజ్యబాపూజీ ఆలోచన, ఈ రోజు దేశ ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలను మనం ఆచరించి ముందుకు అడుగులు వేయాలని, అప్పుడే ఆరోగ్యవంతమైన భారతదేశంగా తీర్చిదిద్దుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందన్నారు.

ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ పండగలు ఆనందం రెట్టింపు అయ్యి, సంతృప్తి కలుగుతుందన్నారు. మంచిసేవలు అందించిన క్లాప్ మిత్రాలకు అక్టోబరు 02వ తేదీన జరిగే ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే విజయవాడలో సభలో బహుమతులు, సన్మానాలు చేసి గౌరవిస్తామని తెలిపారు.

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ… స్వచ్ఛతాహి సేవ – 2025 కార్యక్రమం జిల్లా అంతటా పరిసరాలు పరిశుభ్రత, మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ఒక్క రోజుతో పరిమితం కాకుండా ప్రతిరోజు కొంత సమయం కేటాయించి నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థి దశనుండే పరిసరాలు పరిశుభ్రత, మొక్కలు నాటుట, పర్యావరణం పట్ల అవగాహన కల్పించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

చెత్త వేసి క్లీన్ చేయడం కన్నా ముందే తగిన జాగ్రత్తలు తీసుకుని చెత్తను డస్ట్ బిన్లులో వెయ్యడం ద్వారా పట్టణాలకు, గ్రామాలకు ఎంతో మేలు చేసినవారము అవుతామని తెలిపారు. ఎప్పటికప్పుడు చెత్తను తీసి పరిసరాలను శుభ్రపరచడం వలన, మనకు ఆరోగ్యంతో పాటు చెత్తను తరలించే ఖర్చులు తగ్గుతాయని, ఆ నిధులు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించడానికి అవకాశం కలుగుతుందిని స్పష్టం చేశారు.

ఏ కార్యక్రమం చేపట్టినా తొలి అడుగు మనతోనే ప్రారంభించి చేయిచేయి కలిపి ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. మంచి ఆలోచనలు, ఆరోగ్య వంతమైన స్థిరమైన ఆహార అలవాట్లు, మన ఇంట, చుట్టుప్రక్కల, పనిచేసే చోట పరిశుభ్రత తప్పక పాటించి స్వర్ణఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర తీర్చిదిద్దుటకు ప్రతి ఒక్కరూ ముందుకు అడుగులు వెయ్యాలని జిల్లా కలెక్టరు వెట్రిసెల్వి పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమీషనరు ఏ.భాను ప్రతాప్, జెడ్పీ సిఈవో యం.శ్రీహరి, డిప్యూటీ కమీషనరు బి.శివారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఏలూరు యుడిఏ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాదు, మార్కెట్ యార్డు చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, కో-ఆప్షన్ సభ్యులు యస్.యం.ఆర్. పెదబాబు, కార్పొరేటర్లు పాము పద్మ, మున్నల కేదారేశ్వరి, వంకదార ప్రవీణ్ కుమార్, సంపన శ్రీనివాసు, లక్ష్మణరావు, మెప్మా సిబ్బంది, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజలు, నగరపాలకసంస్థ ఉద్యోగులు, వార్డు సచివాలయ సిబ్బంది, క్లాప్ మిత్రాలు, తదితరులు పాల్గొన్నారు.