🔴 ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టర్ కార్యాలయం : ది డెస్క్ :
పోలవరం నియోజకవర్గంలో రూ.2 వేల కోట్లతో నౌకాదళ ఆయుధగారం ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చొరవతో ఈరోజు నేవీ అధికారులతో ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఎంపీ, ఈ ప్రాజెక్టు కోసం జీలుగుమిల్లి ప్రాంతంలో స్థల పరిశీలన కూడా చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రాజెక్టు పురోగతిపై నౌకాదళ అధికారులను ప్రశ్నించారు.
నేవీ అధికారులు మాట్లాడుతూ.. జీలుగుమిల్లి ప్రాంతంలో 3 గ్రామాల పరిధిలో 1166 ఎకరాలు గుర్తించామని, భూసేకరణ పూర్తయితే త్వరలోనే పనులు మొదలుపెడతామని, 10 ఏళ్లలో ఇది పూర్తి అవుతుందని సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. గతంలో పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణ సమయంలో వచ్చిన ఇబ్బందులను నేవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం, స్థానికులకు ఉపాధి కల్పించేందుకు మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలనీ నౌకాదళ అధికారులను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు.
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..వెనుకబడ్డ మారుమూల ప్రాంతాలు కూడా పట్టణాలతో సమంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో పట్టుబట్టి పోలవరం ప్రాంతానికి ఈ నేవీ ఆర్మ్స్ డిపో ప్రాజెక్టును తీసుకువచ్చానన్నారు.
కాకినాడ, విశాఖ తీర ప్రాంతం ఇక్కడికి దగ్గరగా ఉండటం వల్ల కూడా కేంద్రం తమ ప్రతిపాదనను ఆమోదించిందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, అపోహలు వీడి స్థానిక ప్రజలంతా సహకరించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రారంభంలో 500 నుంచి 1000 మందికి భవిష్యత్తులో 2000 మందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ చెప్పారు. స్థానిక యువతకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నైపుణ్య శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తామని అన్నారు.
దాదాపు 2 వేల మంది నేవీ సిబ్బంది ఇక్కడ పనిచేస్తారని అధికారులు తమకు చెప్పారని, స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, హోటళ్ల వంటివి రావడంతో భవిష్యత్తులో ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ప్రతిష్ఠాత్మకమైన “కేంద్రీయ విద్యాలయం” సంస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారని నేవీ అధికారులు చెప్పారన్నారు.
ఈ ప్రాజెక్టు వల్ల పర్యాటకం కూడా అభివృద్ధి అవుతుంది. నిర్మాణాలు ప్రారంభించినప్పటి నుంచే 60 శాతం మంది పనివారిని స్థానికంగానే తీసుకుంటామని నేవీ అధికారులు తమకు హామీ ఇచ్చారన్నారు. 1944 నుంచే దేశంలో ఆయుధ డిపోల ఏర్పాటు జరుగుతోందని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయనీ, విశాఖతో సహా దేశంలో అనేక ఆయుధ డిపోలు ఉన్నాయని ఇప్పటి వరకూ ఎటువంటి ప్రమాద ఘటనలు జరగలేదని ఎంపీ వివరించారు.
నేవీ ప్రాజెక్టుకు భూమి కేటాయించే ప్రాంతంలో 400 నుంచి 500 నివాస గృహాలు ఉన్నాయని, వారికి వేరే చోట వసతి కల్పిస్తారనీ, R&R ప్యాకేజీ కింద 470 కోట్లు కేటాయిస్తున్నారనీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. జీలుగుమిల్లి ప్రాంతంలో ఆయుధ కర్మాగారం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి, పోలవరం నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే ఈ ప్రాంతంలోని ప్రజలు, యువత జీవన విధానం మారుతుందని ఎంపీ స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టును కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని, రూ .2 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు వెళ్లిపోతే పోలవరం నియోజవర్గంలో అభివృద్ధి కుంటుపడుతుందని ఎంపీ తెలిపారు. నేవీ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి రావటం పోలవరం నియోజకవర్గానికే కాకుండా ఏలూరు జిల్లాకి, రాష్ట్రానికి కూడా గర్వకారణం అని, దీనివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ.. నిర్వాసితులకు పూర్తి న్యాయం చేశాకే పనులు ప్రారంభిస్తారని, త్వరలో గ్రామసభలు నిర్వహించి ప్రజల అంగీకారం తీసుకుంటామన్నారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషివల్లే ఈ ప్రాజెక్ట్ పోలవరం ప్రాంతానికి వచ్చిందని చెబుతూ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.
నేవీ అధికారులతో జరిగిన సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాస రావు, కలెక్టర్ వెట్రిసెల్వి, నేవీ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.