The Desk…Eluru : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం ఖాయం – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

The Desk…Eluru : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం ఖాయం – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

  • పార్లమెంట్ లో ఎన్డీయేకు పూర్తి మెజారిటీ
  • ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గెలుపు ఖాయం.
  • అదనపు పొగాకు కొనుగోళ్లకు కేంద్రం అనుమతిపై ఎంపీ హర్షం.
  • పొగాకు రైతుల కోసం తాను పడ్డ శ్రమ ఫలించినందుకు సంతోషం.
  • కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ.‎

🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :‎

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధిస్తుందన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఎంపీలు పాటించాల్సిన నియమ నిబంధనలపై సోమవారం ఉదయం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణ దేవరాయలు నివాసంలో పార్టీ ఎంపీలకు శిక్షణా సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ పాల్గొన్నారు. అనంతరం, మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రస్తుతం ఉన్న సభ్యులు  781మంది కాగా, విజయం సాధించడానికి 391 అనుకూలంగా ఓటేస్తే చాలునని, కానీ ఎన్డీయేకు లోక్‌సభలో 293 మంది, రాజ్యసభలో 129 మంది మొత్తంగా 422 మంది సభ్యుల బలం ఉందన్నారు.

అంటే విజయానికి అవసరమైన దానికంటే 31 మంది సభ్యులు ఎక్కువే ఉన్నారు. ఎన్డీయేతర పార్టీల నుంచి కూడా అనేక మంది మద్దతు ఇస్తున్న పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సునాయాసంగా విజయం సాధిస్తారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలు ఏ ధైర్యంతో తమ అభ్యర్థిని నిలబెట్టాయో తెలియదన్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న తాము మాత్రం తమ పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ గారి సూచనల ప్రకారం  రాధాకృష్ణన్ కి అనుకూలంగా ఓటు వేసి ఆయనను ఉపరాష్ట్రపతిగా గెలిపిస్తామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు.

‎ప్రజా జీవితంలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగి, వివాదరహితమైన ఎంపీగా, ఎన్నో పార్లమెంట్ కమిటీలకు చైర్మన్ గా, గవర్నర్ గా, పనిచేసిన రాధాకృష్ణన్ గొప్ప పరిపాలనా నైపుణ్యాలు కలిగిన వ్యక్తి అని, అటువంటి వ్యక్తిని ఎన్డీయే తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెట్టడం ప్రధాని నరేంద్ర మోదీ దూర దృష్టికి నిదర్శనం అన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన సమయంలో కూడా ఆయన ఎటువంటి వివాదాలు లేకుండా పనిచేశారని, అటువంటి నేత ఉపరాష్ట్రపతి పదవికి వన్నె  తేవడంతోపాటు, రాజ్యసభ చైర్మన్ గా కూడా సభను సమర్థవంతంగా నడపగలరనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా సోమవారం ఢిల్లీ వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తో జరిగిన ఎంపీల సమావేశంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ ఎన్నిక సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంపీలకు నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు.

‎అదనపు పొగాకు కొనుగోళ్లకు అనుమతిపై కేంద్రానికి ధన్యవాదాలు..
‎స్వల్ప పెనాల్టీతో అదనపు పొగాకు కొనుగోళ్లకు అనుమతిస్తూ కేంద్రం గెజిట్ ఉత్తర్వు జారీచేయడంపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ‎

పొగాకు రైతుల సమస్యలపై ఇటీవల ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేసిన విషయాన్ని ప్రస్తావించిన ఎంపీ.. తమ శ్రమ ఫలించినందుకు సంతోషంగా ఉందని, రైతుల ఇబ్బందులను తెలుసుకుని, తమ విజ్ఞప్తులను మన్నించి కేవలం 1 నుంచి4 శాతం స్వల్ప పెనాల్టీతో అదనపు పొగాకు కొనుగోళ్లకు అనుమతించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో ఏలూరు జిల్లాలో అధికంగా పొగాకు పండిస్తున్న రైతులతో పాటు రాష్ట్రంలోని పొగాకు రైతులందరికీ ఎంతో మేలు చేకూరుతుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.