🔴 అమరావతి : ది డెస్క్ :
నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. 1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం నాలుగు సార్లు సీఎంగా పనిచేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు.
మొదటి, రెండో సార్లలో 8 సంవత్సరాలు 8 నెలలు 13 రోజులు సీఎంగా కొనసాగి, హైటెక్ సిటీ, సైబరాబాద్, శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్ రూపురేఖలను పూర్తిగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే అని గుర్తుచేశారు. నేటి ఆధునిక తెలంగాణకు సాంకేతిక, మౌలిక వసతుల బలమైన పునాది చంద్రబాబే వేశారని మంత్రి అన్నారు.
2014లో రాష్ట్ర విభజన అనంతరం సీఎం పదవి చేపట్టిన చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని రూపకల్పన, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖను ఆర్థిక, ఐటీ రాజధానిగా అభివృద్ధి, రాయలసీమలో పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించడం వంటి పలు ప్రధాన కార్యక్రమాలను చేపట్టారని వివరించారు. దేశ రాజకీయాల్లో కింగ్‌మేకర్‌గా కీలక పాత్ర పోషించి, జాతీయ స్థాయిలోనూ తెలుగు ప్రజల గౌరవాన్ని పెంచిన అరుదైన నాయకుడు చంద్రబాబేనని మంత్రి ఆనం పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు వారి “ఆత్మ గౌరవం” అయితే….. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు వారి “ఆత్మవిశ్వాసం” అని బలంగా చెప్పొచ్చు కష్టకాలాల్లోనూ పార్టీని బలపరిచి, ఎప్పటికి అప్పుడు క్యాడర్ కి ధైర్యం నింపుతూ, ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడుదేనని అన్నారు.
నేటి రోజుల్లో కూడా సంక్షేమం, అభివృద్ధి అనే రెండు చక్రాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ, ప్రజల అంచనాలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు. 30 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో 15 సంవత్సరాలకు పైగా సీఎంగా పనిచేయడం ఒక విశిష్టమైన రికార్డు. ఇంత దీర్ఘకాలం రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం చంద్రబాబు నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనమని తెలిపారు.
“హైదరాబాద్‌లో నాడు హైటెక్ సిటీని రూపకల్పన చేసిన చంద్రబాబు నాయుడు, నేడు అమరావతిలో క్వాంటం వ్యాలీకి రూపకల్పన చేస్తూ.. కొత్త తరం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. నాడు సాఫ్ట్వేర్ రంగానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు, నేడు పెరుగుతున్న సాంకేతికతను AI ద్వారా అందిపుచ్చుకోవడం బాబు ప్రత్యేకత. అలాంటి విజనరీ నాయకుడికి నా హృదయపూర్వక అభినందనలు” అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.