ఏలూరు జిల్లా : కైకలూరు (క్రైమ్) : ది డెస్క్ :
వృద్ధురాలి మెడలో బంగారు నాన్ తాడు ను తెంచుకుని పరారైన నిందితుడిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నామని కైకలూరు పట్టణ పోలీసులు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… కైకలూరు నుండి కోరుకొల్లు వెళ్లే రోడ్డులో బోడావుల గంగా మహాలక్ష్మి (70) వృద్ధురాలి మెడలో బంగారు నాన్ తాడు ను సుమారు 30 సంవత్సరాలు వయస్సు గల యువకుడు వెనక నుండి బలవంతంగా లాక్కుని పారిపోయాడు.
ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ పి. కృష్ణ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి.. ఆదివారం బోడావుల గంగా మహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు పై కేసును నమోదు చేసారు. దర్యాప్తులో భాగంగా గురువారం ఇన్స్పెక్టర్ పి. కృష్ణ ఆదేశాలపై ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి కైకలూరు – కోరుకోల్లు రోడ్డులో ఆచవరం రైల్వే గేటు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపిస్తూ.. బ్లాక్ స్పెండర్ ప్లస్ బైక్ ఏపీ 39 ఎన్ ఎన్ 8678. బైక్ మీద పారి పోవటానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అతని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడు కైకలూరు మండలం వేమవరపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిసింది.

నిందితునిపై ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతని వద్ద నుండి 3కాసుల బంగారు నాన్ తాడు, నేరం చేయటానికి ఉపయోగించిన బ్లాక్ బైక్ ను అదుపులోకి తీసుకుని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచామన్నారు.

కేసు దర్యాప్తునకు కృషి చేసిన ఎస్సై, వారి సిబ్బందిని డీఎస్పీ శ్రావణ్ కుమార్ అభినందించారు.