ఏలూరు జిల్లా : వేలేరుపాడు : ది డెస్క్ :

గోదావరి నదికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న దృష్ట్యా ముంపు ప్రాంతాల ప్రజలు అధికారులతో సహకరించి వరద సహాయ కేంద్రాలకు తరలి రావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో కలెక్టర్ అధికారులతో కలిసి బుధవారం ముంపు గ్రామాలైన కట్కూరు, ఎర్రతోలు, బోళ్లపల్లి,, చిత్తంరెడ్దిపాలెం, తదితర గ్రామాలలో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద కారణంగా రహదారి మార్గం తెగిపోయిన యడపల్లి గ్రామస్తులను చూసి, వారిలో వరద పునరావాస కేంద్రాలకు తరలి వచ్చే వారిని తీసుకురావాలని బోట్లను పంపించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. భద్రాచలం నుండి గోదావరి వరద నీరు ఉధృతంగా ప్రమాద స్థాయిలో దిగువకు వచ్చే అవకాశం ఉన్నదని, అంతేకాక పెద్దవాగు, ఎద్దువాగుల నుండి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వరద ముంపు ప్రభావం పొంచి ఉన్నందున, ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు టార్పాలిన్లు అందించడం జరిగిందన్నారు.
వర్షాల కారణంగా కూలిపోయే శిధిలావస్థలో ఉన్న భవనాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. జిల్లాకు ఇప్పటికే 2 ఎస్డిఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయని, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ముంపు ప్రాంతాలలో వరద సహాయ చర్యలను వెంటనే ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ముంపు ప్రమాద ప్రాంతాలలోని గర్భణీలు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్దులు, విభిన్న ప్రతిభావంతులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణీలను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలన్నారు. వరద పరిస్థితి, సహాయక చర్యలపై ఏలూరు కలెక్టరేట్ లో 1800 233 1077 మరియు 94910 41419 ఫోన్ నంబర్లతో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుచేయడం జరిగిందని, అంతేకాక జంగారెడ్డిగూడెం, నూజివీడు డివిజన్లలో, కుక్కునూరు, వేలేరుపాడులలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.
ముంపు ప్రాంతాలలో సెల్ ఫోన్ టవర్ల పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. రవాణా సౌకర్యాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా కూలిన చెట్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై వరద పరిస్థితిని కలెక్టర్ సమీక్షించారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా ఎటువంటి నష్టం కలగకుండా తీసుకోవలసిన చర్యలపై అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. వేలేరుపాడు లోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి, వరద సహాయ కేంద్రంగా ఏర్పాటుచేసేందుకు పరిశీలించి చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ, డిఆర్డిఏ పీడీ ఆర్. విజయరాజు, డిఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు, తహసీల్దార్, ఎంపిడిఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.