“డ్రగ్స్ వద్దుబ్రో” అవేర్నెస్ ప్రోగ్రాంలో మండవల్లి ఎస్సై వి. రామచంద్రరావు
ఏలూరు జిల్లా : మండవల్లి(క్రైమ్) : ది డెస్క్ :

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, ఏలూరు డి.ఎస్.పి డి. శ్రావణ్ కుమార్ ఆదేశాలపై.. కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు(శనివారం) కైకలూరు రూరల్ సర్కిల్ మండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెరికే గూడెం, మండవల్లి గ్రామాలలో మండవల్లి పోలీసులు “డ్రగ్స్ వద్దుబ్రో” అనే అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండవల్లి ఎస్ఐ వి. రామచంద్ర రావు మాట్లాడుతూ.. గంజాయి వంటి మత్తు పదార్థాలకు జోలికి వెళ్ళొద్దని.. ఎవరూ కూడా గంజాయి మత్తుకు బానిసలు కావద్దని సూచించారు.
ఎవరైనా గంజాయి సేవించిన, అమ్మిన, తీసుకున్న, రహస్యంగా చెట్టు పెంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గంజాయి సేవించినట్లయితే పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని, దీన్ని సేవించిన వ్యక్తి సహనం కోల్పోయి విచక్షణ రహితంగా ప్రవర్తిస్తారని ఆయన అన్నారు.
గంజాయిని గురించి ఏమైనా సమాచారం తెలిస్తే.. టోల్ ఫ్రీ నెంబర్ 1972, 112 కు తెలియపరచాలన్నారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారని నిశితంగా పరిశీలించాలని సూచించారు.
అవగాహన కార్యక్రమంలో మండవల్లి ఎస్ఐ వి రామచంద్ర రావు, పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.