- ఆదివాసీల సాధికారతకు దార్శనిక ప్రణాళికలు
- ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలతో ప్రభుత్వం కృషి
- ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్తపైనా ప్రత్యేక దృష్టి
- పీ4 కార్యక్రమం అమలుకూ చొరవ తీసుకుంటున్నాం
- గిరిజనుల తలసరి ఆదాయంలో వృద్ధికి ప్రణాళికల అమలు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
🔴 ఎన్టీఆర్ జిల్లా : తిరువూరు : ది డెస్క్ :

సుసంపన్న, ఆరోగ్య, ఆనంద ఆంధ్ర సాకారానికి గిరిజనుల సమగ్రాభివృద్ధి కూడా కీలకమని.. ఆదివాసీల సాధికారతకు ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలతో ప్రభుత్వం కృషిచేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకొని అన్ని విధాలా ఉన్నతంగా ఎదగాలని శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు అధ్యక్షతన శనివారం ఎ.కొండూరులోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు జరిగాయి.

తొలుత శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు, కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులు, గిరిజన నాయకులతో కలిసి మహనీయులు సేవాలాల్ మహరాజ్, ఏకలవ్యుడు, డా. బీఆర్ అంబేద్కర్, వెన్నెలగంటి రాఘవయ్య, అల్లూరి సీతారామరాజు, చెంచులక్ష్మి తదితరులకు ఘన నివాళులు అర్పించారు. వేడుకల్లో గిరిజన సంప్రదాయ కళా ప్రదర్శనలు అలరించగా.. శాసనసభ్యులు, కలెక్టర్ గిరిజన విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ..
50 శాతానికిపైగా గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో ఐటీడీఏల ద్వారా విశేష కృషి జరుగుతోందని.. ఎస్టీ సబ్ ప్లాన్ అమలుతో పాటు వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమల్లోనూ ప్రత్యేక అధికార యంత్రాంగం పనిచేస్తోందన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిపైనా ప్రత్యేకంగా దృష్టిసారించడం జరుగుతోందన్నారు.
గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని.. వీటిలో చదువుకొని ఎందరో గొప్పవారయ్యారన్నారు. స్వర్ణాంధ్ర @ 2047లో భాగంగా గౌరవ శాసనసభ్యుల నేతృత్వంలో నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, గిరిజనుల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో పీ4 కార్యక్రమం కింద 86 వేల బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందని, వీటిలో దాదాపు 20 శాతం కుటుంబాలు గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నట్లు వివరించారు. ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని, వారు కూడా మహిళలు కావాలనేది సంకల్పమని, ఇందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎ.కొండూరు ప్రాంతానికి జల్ జీవన్ మిషన్ ద్వారా త్వరలోనే కృష్ణా జలాల సరఫరా జరగనుందని.. కిడ్నీ వ్యాధులకు కారణాలను విశ్లేషించేందుకు ప్రత్యేక బృందాలతో శాస్త్రీయ అధ్యయనం నిర్వహిస్తున్నట్లు వివరించారు. భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు.
జిల్లాను నాటుసారా రహితం చేసేందుకు నవోదయం 2.0 కార్యక్రమాన్ని అమలుచేస్తున్నామని, 108 కుటుంబాలకు పాడి పశువులు, కిరాణా దుకాణాలు వంటి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు వివరించారు. గిరిజన నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలను క్షుణ్నంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
గిరిజనులు ఆకాశమే హద్దుగా ఎదగాలి : శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు
శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు చదువుకునేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదివాసీలు తమ పిల్లలను బాగా చదివించుకొని, వెనుకబాటుతనంనుండి బయటపడి నాగరిక సమాజంతో పోటీపడి ఆకాశమే హద్దుగా ఎదగాలని విజ్ఞప్తి చేశారు.
ఆదివాసీ యువత, విద్యార్థులు చెడుఅలవాట్లకు దూరంగా ఉండాలని, అదేవిధంగా తండాల పెద్దలు తమ పిల్లల చదువులపై దృష్టిపెట్టి మంచి దారిలో నడిపించాలన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగాలలో తిరువూరు నియోజవర్గం నుండి 37 మంది ఎంపికయ్యారని వారిలో గిరిజన యువకులు ఉన్నారన్నారు. ఈనెల 22న తిరువూరులో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నామని, 500 మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించే జాబ్ మేళాను పదోతరగతి నుండి ఇంటర్, డిగ్రీ వరకు నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారన్నారు. కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారంగా రూ. 40 కోట్లతో తండాలకు కృష్ణానది జలాల తరలింపు పథకం నెల రోజుల్లో పూర్తికావస్తుందని, ప్రారంభోత్స వానికి సిద్ధం చేస్తున్నామన్నారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యంగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ప్రపంచంతో పోటీ పడదామని శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. వేడుకల్లో భాగంగా గిరిజన నాయకులను సత్కరించారు.
వేడుకల్లో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎ.విజయశాంతి, తిరువూరు ఆర్డీవో కె.మాధురి, మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య, విద్యావేత్త బి.జ్యోతిలాల్ నాయక్, జెడ్పీటీసీ భుక్యా గన్యా, స్థానిక గిరిజన నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.