The Desk…Vijayawada : స్పాట్ రిజిస్ట్రేషన్‌… స్పాట్ లోనే డాక్యుమెంట్

The Desk…Vijayawada : స్పాట్ రిజిస్ట్రేషన్‌… స్పాట్ లోనే డాక్యుమెంట్

పటమట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన అధికారులు..!

సత్ఫలితాలు ఇస్తే – రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల..!!

🔴 NTR జిల్లా : విజయవాడ : ది డెస్క్ :

రిజిస్ట్రేషన్లను మరింత సులభతరం చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గతంలో స్థలాలు, భూముల రిజిస్ట్రేషన్‌ కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద క్రయ, విక్రయదారులు, సాక్షులు ఎక్కువ సమయం వెచ్చించేవారు. ప్రస్తుతం స్లాట్‌ బుకింగ్‌ విధానంతో సూచించిన సమయానికి వచ్చి పని చేయించుకుంటున్నారు.

ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా మారింది. అదే తరహాలో రిజిస్ట్రేషన్‌ చేసిన వెంటనే దస్తావేజులు వెంటనే అందించే విధానాన్ని ప్రభుత్వం పటమట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ పద్ధతి మంచి ఫలితాలు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. వాస్తవానికి రిజిస్ట్రేషన్‌ చేయడానికే గంటల సమయం పట్టేది. సిబ్బంది కూడా సరిపడా ఉండేవారు కాదు. రిజిస్ట్రేషన్‌ అయ్యాక దస్తావేజులను స్కాన్‌ చేయాలి.

తరువాత ఆస్తి కొనుగోలు చేసిన వారికి ఇవ్వాలి. సరిపడా సిబ్బంది లేకపోవడంతో కొనుగోలుదారులతో సంతకం చేయించుకుని మరుసటి రోజు దస్తావేజులు ఇచ్చేవాళ్లు. ఆస్తి కొనుగోలు చేసినవారు వాటని తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యను ప్రభుత్వం గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం వచ్చే పటమట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఎంపిక చేసింది. ఇద్దరు జూనియర్, ఒక సీనియర్‌ సహాయకుడిని నియమించింది.

సోమవారం 52 మంది రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. పత్రాలను సిబ్బంది స్కాన్‌ చేశారు. పది నిమిషాల వ్యవధిలోనే వినియోగదారులకు దస్తావేజులు ఇచ్చామని పటమట సబ్‌రిజిస్ట్రార్‌ రేవంత్‌ తెలిపారు. దస్తావేజులు తీసుకోవడానికి కనీసం రెండ్రోజులు పట్టేదని, రిజిస్ట్రేషన్‌ చేసిన వెంటనే తమకు పత్రాలు ఇవ్వడం ఆనందంగా ఉందని పలువురు కొనుగోలుదారులు తెలిపారు.

కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రవేశపెట్టామని, రాష్ట్రంలో మరిన్ని కార్యాలయాలకు దీనిని విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ రవీంద్రనాథ్‌ తెలిపారు.

www.thedesknews.net