THE DESK NEWS : వరద ముంపు ప్రాంతాలలో పలువురు రాష్ట్ర మంత్రుల పర్యటన

THE DESK NEWS : వరద ముంపు ప్రాంతాలలో పలువురు రాష్ట్ర మంత్రుల పర్యటన

ఏలూరు జిల్లా, కుక్కునూరు/వేలేరుపాడు (ద డెస్క్ న్యూస్) : వరద ముంపునకు గురైన కుక్కునూరు, వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలలోని బాధితులను రాష్ట్ర హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి, జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు, వ్యవసాయ శాఖామంత్రి కింజారపు అచ్చెన్నాయుడు లు కలిసి పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల్లో ప్రభుత్వం తమకు పూర్తి స్థాయిలో సాయం అందిస్తుందన్న భరోసా నింపారు. ఈ సందర్భంగా దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీలోని బాధితులను కలుసుకుని వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు.

ఈ స్సందర్భంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. గోదావరి వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడం తమ బాధ్యతన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరదల మొదటిరోజు రాత్రి 12 గంటలకు జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి వరద పరిస్థితి తెలుసుకున్నారని, ఆ రోజు నుండి బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, వారికీ పూర్తి స్థాయిలో సహాయ కార్యక్రమాలను అమలు చేయాలనీ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జరీ చేశారన్నారు. ఇప్పటికీ ప్రతీ రోజు పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారని, బాధితులకు పూర్తి స్థాయిలో అందేలాగా చూడాలని, వారికి ఇంకా చేయవలసినది ఏమైనా ఉన్నదా అని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మంత్రుల బృందాన్ని ఇక్కడకు పంపారన్నారు. పెద్దవాగు ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో 14 వేల ఎకరాలు సాగవుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్వహణను 85 శాతం ఆంధ్రప్రదేశ్, 15 శాతం చేయవలసి ఉన్నాడని, గత ప్రభుత్వ హయాంలో పెదవాగు ప్రాజెక్ట్ మరమ్మత్తులకు 80 కోట్ల రూపాయలు అంచనాలు రూపొందించగా, గత ప్రభుత్వం తన వాటా చెల్లించకుండా , పెడచెవిన పెట్ట్టారని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం ఈ పరిస్థితి వాటిటిల్లిందని, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెదవాగు ప్రాజెక్ట్ కారణంగా వరద ముంపు జరగకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి చెప్పారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం బాధితులకు పూర్తిస్థాయిలో సహాయ చర్యలు అందించాలన్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వరద ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో సహాయం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. 2022 సంవత్సరంలో కుక్కునూరు, వేలేరుపాదులలో వచ్చిన వరదలు అతిపెద్ద వరదలని , ఆ సమయంలో ముందుగా చంద్రబాబునాయుడు బాధితులను కలిసి వారిలో భరోసా నింపారన్నారు. ఈనెల 26వ తేదీన అసెంబ్లీ లో వరద బాదితులకు అందుతున్న సహయంపైనే పూర్తి స్థాయి చర్చను ముఖ్యమంత్రి చేశారని, వేంటనే వెళ్లి అక్కడ పరిస్థితిని పరిశీలించవల్సిందిగా మంత్రుల బృందాన్ని ఆదేశించారన్నారు. వరద ప్రమాదం పూర్తిగా తగ్గినతరువాత బాధితులను ఇంటివద్ద క్షేమంగా అధికారులు దిగపెడతారన్నారు.

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు బాధితులకు అందిస్తున్న సాయం కాక, వారి సమస్యాలు తెలుసుకుని వారికీ ఇంకా ఏ విధంగా సాయం చేయగలమో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వచ్చామన్నారు. వరద ప్రమాదం పూర్తిగా తగ్గేవరకూ బాధితులు పునరావాస కేంద్రాలలో ఉండవచ్చని, వారికి ఏ సమస్య రాకుండా అధికారులు చూసుకుంటారన్నారు. వరదల కారణంగా నిర్వాసితులైన కుటుటంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంట నూనె, 5 రకాల కాయగూరలు కేజీ చొప్పున అందించాలని, వరద పూర్తి స్థాయిలో తగ్గిన అనంతరం పునరావాస కేంద్రాల నుండి వారి ఇళ్లకు వెళ్లే ప్రజలకు కుటుంబానికిఇ 3 వేల రూపాయలు చొప్పున అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటారనన్నారు.

రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతికి దోహదం చేసే పోలవరం ప్రాజెక్ట్ కోసం భూములను త్యాగం చేసిన నిర్వాసితులకు నష్టపరిహారంను త్వరితగతిన అందించేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు ప్రభుత్వానికి ప్రదమ ప్రాధాన్యతని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని బాధితులకు పూర్తిస్థాయిలో సాయం అందించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలు కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు కలగలేదన్నారు. ఈ సందర్భంగా గొమ్ముగూడెం నకు చెందిన వరద బాధితురాలు సముద్రాల రజిత మాట్లాడుతూ.. అధికారులు వరద బాదితులకు పూర్తి స్థాయిలో సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారని, అధికారులంతా తమని చక్కగా చూసుకున్నారన్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ , జేసీ పి . ధాత్రిరెడ్డి, శాసనసభ్యులు చిర్రి బాలరాజు, చింతమనేని ప్రభాకర్, జిల్లా పరిషత్ సీఈఓ కె. సుబ్బారావు, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, ప్రభృతులు పాల్గొన్నారు. అనంతరం మంత్రుల బృందం కన్నయ్యగుట్టలో గోదావరి వరద ఉధృతిని పరిశీలించింది. బాధితులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరద సాయంగా బియ్యం, నిత్యావసర సరుకులు, 3 వేల రూపాయల నగదును బాధితులకు అందజేశారు.