The Desk…Machilipatnam : వేరుశనగ సాగుకు కేంద్రం 100% రాయితీ ఇస్తోంది.. ఆ దిశగా రైతులను ప్రోత్సహించండి : అధికారులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశం

The Desk…Machilipatnam : వేరుశనగ సాగుకు కేంద్రం 100% రాయితీ ఇస్తోంది.. ఆ దిశగా రైతులను ప్రోత్సహించండి : అధికారులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశం

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

జిల్లాలో 1000 హెక్టార్లలో వేరుశనగ పంట సాగుకు కేంద్ర ప్రభుత్వం నూరు శాతం సబ్సిడీ ఇస్తోందని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో జిల్లా నూనె విత్తనాల మిషన్ జిల్లా కార్యనిర్వాహక కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం నూనె విత్తనాలు — వంటనూనెల జాతీయ మిషన్ కృషోన్నతి యోజన కింద జిల్లాలో రబి కాలంలో 500 హెక్టార్లు, ఖరీఫ్ కాలంలో మరో 500 హెక్టార్లను ఒక క్లస్టర్ గా గుర్తించి రైతులకు నూతన వేరుశనగ వంగడాలను సాగు చేసుకునేలా ప్రోత్సహిస్తుందన్నారు. వేరుశనగ వశిష్ట రకం నూరు శాతం రాయితీతో అందించి వేరుశనగ పంట విస్తీర్ణాన్ని పెంచడమే పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు.

అంతేకాకుండా రైతులకు మేలైన యాజమాన్య పద్ధతులలో శిక్షణ ఇచ్చి అధిక దిగుబడులు సాధించే దిశగా కృషి చేయాలన్నారు. రైతులకు మార్కెటింగ్ సౌకర్యం తో పాటు ప్రాసెసింగ్ సౌకర్యాలు కూడా కల్పించాల్సి ఉంటుందన్నారుఈ పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు నూనె విత్తనాల జిల్లా మిషన్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు అయిందన్నారు.

ఇందులో జిల్లా వ్యవసాయ అధికారి సభ్య కార్యదర్శిగా, ఉద్యాన శాఖ అధికారి, కృషి విజ్ఞాన కేంద్రం ప్రతినిధులు, ఆత్మ ప్రతినిధులు, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజరు, నాబార్డు ప్రతినిధులు, విత్తనాల ఏజెన్సీలు ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్ ల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారన్నారు. అలాగే జిల్లా కార్యనిర్వాహక కమిటీలో జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగాను, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా ఖజానా అధికారి, ఆత్మ అధికారి సభ్యులుగా ఉంటారన్నారు.

సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్రావు, ఏడి మణిధర్, ఉద్యాన అధికారి జే జ్యోతి, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల కార్యక్రమ సమన్వయకర్త డి సుధారాణి, ఆత్మ జిల్లా వనరుల కేంద్రం ఉపసంచాలకులు కే జ్యోతి రమణ,, బ్యాంకు ప్రతినిధి లోకేష్, నాబార్డ్ డి డి ఎం మిలింద్ చౌశాల్కర్, విత్తన ఏజెన్సీలు, రైతు సంఘాల ప్రతినిధులు కే శ్రీకాంత్, బి సుజయ్ కుమార్, కే రత్న కిషోర్, పి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.