The Desk…Eluru : యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచన

The Desk…Eluru : యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచన

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి నేపథ్యంలో సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతి ఒక్కరి జీవితంలో యోగ భాగం కావాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

నిత్యం ఉదయం పూట యోగాసనాలు సాధన చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ప్రశాంతత లభిస్తుందని ఎంపీ వెల్లడించారు. ప్రస్తుత యాంత్రికరణ జీవితంలో దీర్ఘకాలిక రుగ్మతల నుంచి ఉపశమనం లభించడానికి యోగ దివ్య ఔషధంగా పనిచేస్తుందని ఎంపీ తెలిపారు.

నిపుణుల పర్యవేక్షణలోనే యోగాసనాల సాధన చేయాలని, తద్వారా ఆయువు ప్రమాణాలు పెంచుకోవాలని ఎంపీ సూచించారు. యోగ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించేలా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2014లో జరిగిన యూఎన్ ప్రసంగంలో చొరవ తీసుకున్నారని, దీనికి సంబంధించిన తీర్మానానికి ప్రపంచవ్యాప్తంగా విస్తృత మద్దతు లభించిందని ఎంపీ స్పష్టం చేశారు.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 177 దేశాలు దీనికి మద్దతు ఇచ్చిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. అనంతరం న్యూయార్క్, పారిస్, బీజింగ్, బ్యాంకాక్, కౌలాలంపూర్, సియోల్, దిల్లీతో సహా ప్రపంచవ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 21 జూన్ 2015న విజయవంతంగా నిర్వహించారని ఎంపీ తెలిపారు.

ఇదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని చరిత్రలో నిలిపేలా విశాఖపట్నం వేదికగా ఏర్పాట్లు చేసిందని ఎంపీ పేర్కొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఎంపీ కోరారు.

కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరు తమ వివరాలను ఈ క్రింద ఇచ్చిన సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు.