- 89.64% రేషన్ పంపిణీ విజయవంతం – చరిత్రలో మైలురాయి
- చౌక ధర దుకాణదారులకు, అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందనలు
NTR జిల్లా : విజయవాడ : ది డెస్క్ :

రేషన్ సంస్కరణల్లో భాగంగా ప్రతినెల 26వ తేదీ నుంచి 30 తేదీలోపు వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందజేయాలని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
విజయవాడ కానూరు సివిల్ సప్లై భవనంలో ఈరోజు మంత్రి నాదెండ్ల మనోహర్ చౌకధర దుకాణదారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు.జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన రేషన్ సరుకుల పంపిణీ మొదటి 15 రోజుల్లోనే 89.64% విజయవంతంగా పూర్తి కావడం ప్రజా పంపిణీ చరిత్రలో ఓ గొప్ప మైలురాయిగా నిలిచిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా 1,46,21,232 మంది రేషన్ కార్డు దారులకు సరుకుల పంపిణీ ప్రారంభమై, ఇప్పటివరకు 1,30,94,539 మందికి రేషన్ సరుకులు అందజేసినట్లు మంత్రి తెలిపారు. అంతేకాక, 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దకే సరుకులు అందించే సేవను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
65 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దకే సరుకులు అందించే సేవను అందుబాటులోకి తీసుకురావడమైందని, ఇప్పటి వరకు 13,14,140 మందికి ఈ విధంగా పంపిణీ చేశామని తెలిపారు — ఇది 83% విజయవంతంగా అందజేయడం జరిగింది. రేషన్ సంస్కరణల్లో భాగంగా ప్రతినెల 26వ తేదీ నుంచి 30 తేదీ లోపు వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దకే సరుకులు అందజేయాలన్నారు.
గిరిజన, ఏజెన్సీ ప్రాంతాలు మరియు కొండలపైన ఉన్న ప్రజలకు… రేషన్ షాప్ కు దూరంలో ఉన్న ప్రజలకు సరుకులు అందించే విషయంలో డీలర్లు చొరవ చూపాలని.. అందుకు క్యాలెండర్ ను డిస్ ప్లే చేయాలన్నారు.సుదీర్ఘమైన ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయంతో కూటమి ప్రభుత్వం డీలర్ ఆదాయం పెంచేందుకు కసరత్తు జరుగుతుందన్నారు. ప్రతి డీలరు తమ షాపును శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
అదేవిధంగా షాపు బయట స్టాక్ బోర్డ్ మరియు ఫీడ్ బ్యాక్ కోసం క్యూఆర్ కోడ్ తో కూడిన పోస్టర్ ను విధిగా ఏర్పాటు చేయాలన్నారు.ప్రజలకు ప్రభుత్వానికి రేషన్ డీలర్లు వారధిగా పని చేయాలన్నారు. ప్రజలకు సరుకు అందించడంలో ఉన్న ఇబ్బందులు సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలన్నారు.డీలర్లు పోటీ మనస్తత్వంతో పనిచేయాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన సేవలందించినప్పుడే మార్పు సాధ్యమన్నారు.పేపర్ లెస్ అడ్మినిస్ట్రేషన్ కు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అందుకు డీలర్లు కూడా సిద్ధం కావాలన్నారు. రేషన్ తీసుకునే కుటుంబాల సంఖ్య గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది.
కూటమి ప్రభుత్వం ఇంటింటికీ సేవ లక్ష్యంతో పనిచేస్తోంది,” అని మంత్రి వివరించారు.రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణానికి వేళకు రేషన్ సరఫరా చేయడం, ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, దూర ప్రాంతాల్లో ఉన్న లబ్దిదారులకు కూడా సరుకులు అందించడమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు.
ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఉదయం 8 గంటల నుంచి 12 వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ పంపిణీ జరుగుతుందన్నారు.ఇక చౌక ధరల దుకాణాల్లో వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు పాత రేషన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టామని తెలిపారు.
“సరఫరా వ్యవస్థలో పొరపాట్లకు తావు లేకుండా, సేవా దృక్పథంతో డీలర్లు పనిచేయాలి. ప్రభుత్వం పారదర్శకత, బాధ్యత, ప్రజల సౌకర్యానికి కట్టుబడి ఉంది,” అని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ విజయవంతమైన పంపిణీకి సహకరించిన చౌక ధర దుకాణదారులకు మరియు పౌర సరఫరా శాఖ అధికారులకు, మంత్రి అభినందనలు తెలిపారు.