ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్:

స్థానిక భవానమ్మ చెరువు పక్కన, మణికంఠపురంలో కొలువై ఉన్న శ్రీ హరిహరసుతుడైన అయ్యప్పస్వామివారి ఆలయ 14వ వార్షికోత్సవం ఆలయ నిర్వాహకుడు, గురుస్వామి గోపిస్వామి పర్యవేక్షణలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఉదయం స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
గణపతి పూజ, పుణ్యాహవాచనం, లక్ష్మీగణపతి అవాహన, మండప ఆవాహనపూజ, పంచామృత అభిషేకాలు, వస్త్ర, పుష్పాలంకరణ తదితర పూజాదిక్రతువులు ఘనంగా నిర్వహించారు. అనంతరం లక్ష్మీగణపతి హోమం వైభవంగా జరిగింది. తొలుత ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ వినాయక, సుబ్రహ్మణ్యేశ్వర, మాలికాపురిమాత, పంచముఖ ఆంజనేయస్వామివార్లకు అర్చకస్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లక్ష్మీగణపతి హోమంలో ఆలయ నిర్వాహుకులు, గురుస్వామి గోపిస్వామి-నాగశిరోమణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీనివాసులు శ్రీనివాస్ బ్రహ్మత్వంలో వేంద్రమంత్రోచ్చారణలతో, భక్తుల జయజయధ్వానాలతో పూజలు.. యజ్ఞయాగాది క్రతువులు శోభాయమానంగా జరిగాయి.
ఈ సందర్భంగా గోపీస్వామి మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. మధ్యాహ్నం 12 గంటలకు కైకలూరుకు చెందిన పునుకొల్లు వెంకటరమణ కుమార్తె హర్షిణి పేరున భక్తనులకు అన్నదానం చేశారు. అన్నదానంలో సుమారు 2వేల మంది వరకు భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ, అన్నప్రసాదాలను స్వీకరించారు.