The Desk…Amaravati : రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టండి : మంత్రి ఆనం

The Desk…Amaravati : రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టండి : మంత్రి ఆనం

నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్. :

ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఎన్ హెచ్ 67 రహదారిపై తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు వెంటనే భద్రతా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేషనల్ హైవే అథారిటీ అధికారులకు అత్యవసర తాఖీదు పంపారు.

NH-67 (హుబ్లి-కృష్ణపట్నం రోడ్) లోని కీలకమైన జంక్షన్-km 693 వద్ద “0” km వద్ద రాష్ట్ర రహదారి 335 (ఆత్మకూర్-హసనాపురం రోడ్) తో కలుస్తున్న ప్రాంతంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 6న ఈ ప్రాంతంలో ఒక కారు ఆటో ఢీకొనడం వలన ఇద్దరు అక్కడికక్కడే మరణించారని, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు.

కలతపెట్టే విషయం ఏమిటంటే, వారం లోపే, అంటే ఈనెల 15న అదే ప్రదేశంలో మరొక తీవ్రమైన ప్రమాదం జరిగిందని,దీని వలన ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఈ పునరావృత సంఘటనలు మరింత ప్రాణనష్టం జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఈ ప్రదేశాన్ని ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్‌గా పరిగణించి, NHAI, రోడ్లు & భవనాలు (రాష్ట్ర రహదారులు), పోలీసు, రెవెన్యూ మరియు రోడ్డు భద్రతా విభాగాల అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించి తక్షణ చర్యలు వెంటనే చేపట్టాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేషనల్ హైవే అథారిటీ అధికారులను కోరారు.

ఉమ్మడి సాంకేతిక అంచనా మరియు అవసరమైన భద్రతా చర్యలను వేగంగా అమలు చేయడం – సంకేతాలు, వేగ నియంత్రణ, నిర్మాణ మెరుగుదల వంటి ప్రజా భద్రత చర్యలు వెంటనే మొదలుపెట్టి ప్రజల విలువైన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిందిగా మంత్రి ఆ లేఖలో అధికారులను కోరారు.