The Desk…Eluru : మండవల్లిలో పేదల ఇళ్ళ స్థలాల్లో పోలీస్ స్టేషన్ నిర్మాణం నిలుపుదల చేయాలి

The Desk…Eluru : మండవల్లిలో పేదల ఇళ్ళ స్థలాల్లో పోలీస్ స్టేషన్ నిర్మాణం నిలుపుదల చేయాలి

  • పేదల ఇళ్ల స్థలాలు మెరక చేయించి ప్రభుత్వమే ఇళ్ళు నిర్మాణం చేయాలి
  • రెవెన్యూ అధికారులు పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం
  • సిపిఎం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు మండవల్లి ఇందిరమ్మ కాలనీ లబ్ధిదారుల ధర్నా..

ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టరేట్ : ది డెస్క్ :

మండవల్లి శివారు తరుగుమూల లేఅవుట్ లో పేదలకు ఇచ్చిన ఇందిరమ్మ కాలనీ స్థలాల్లోని కామన్ స్థలాన్ని పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించడం దారుణమని, ఇందిరమ్మ కాలనీ లబ్ధిదారులకు అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం మండవల్లి తరుగుమూల ఇందిరమ్మ కాలనీ లబ్ధిదారులు ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. మా స్థలాల్లో పోలీస్ స్టేషన్ నిర్మాణం ఆపాలని, మా స్థలాలు పూడిక చేసి ప్రభుత్వమే ఇళ్ళు నిర్మాణం చేయాలంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె. శ్రీనివాస్ మాట్లాడుతూ.. 2006లో అప్పటి ప్రభుత్వం ఇళ్ళు లేని నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల స్థలాలు పేరుతో 131 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలను పంపిణీ చేశారని గుర్తు చేశారు.

ఆ స్థలాలు లోతట్టు ప్రాంతంలో ఉండడంతో లెవలింగ్ చేసి ఆ స్థలాలలో ఇందిరమ్మ గృహాల పేరుతో వెంటనే ఇండ్లు నిర్మించి ఇస్తామని, స్థల పట్టాలను గృహనిర్మాణ శాఖ తీసుకోవడం జరిగిందని అన్నారు. గత 20 సంవత్సరాలుగా పేదల స్థలాలను మెరక చేయకుండా ఇళ్ళు నిర్మాణం చేయకుండా ప్రభుత్వాలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.

లబ్ధిదారుల అవసరార్థం బడి, గుడి, కమ్యూనిటీ హాల్, అంగన్వాడి ఏర్పాటు చేసుకునే విధంగా 40 సెంట్లు కామన్ స్థలం కూడా ఏర్పాటు చేశారని చెప్పారు.అప్పటినుండి నేటికి 20 సంవత్సరాలుగా పట్టాలన్న ఇవ్వండి మేరకైనా చేయండి అంటూ 131 మంది లబ్ధిదారులు పోరాటం చేస్తూనే ఉన్నారని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి వేడుకుంటున్నా 20 ఏళ్లుగా ఎవరూ పట్టించుకోలేదన్నారు.

ఇప్పుడు అదే ఇండ్ల స్థలాలలో లబ్ధిదారుల అవసరార్థం ఏర్పాటుచేసిన కామన్ సైట్ లో పోలీస్ స్టేషన్ నిర్మించేందుకు పంచాయతీ గుట్టు చప్పుడు కాకుండా తీర్మానం చేసిందని, ప్రభుత్వ అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడం దారుణమని విమర్శించారు.

20 ఏళ్లుగా మెరకన్నా చేయండి.. పట్టాలన్న ఇవ్వండి అని ఆందోళన చేపట్టినా ఎవరు గుప్పెడు మట్టి వేయకపోగా పోలీస్ స్టేషన్ కు ఆ ప్రాంతంలో స్థలం కేటాయించడంతో గంటల వ్యవధిలో ఆ స్థలాన్ని మట్టితో పూడిక చేయడంతో ప్రభుత్వాలకు పేదల పట్ల శ్రద్ధ ఏమిటో అనేది అర్థమవుతుందన్నారు.

పేదల ఇండ్ల స్థలాలలో పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని నిలుపుదల చేసి పేదల స్థలాలు మెరక చేసి ఇండ్లు నిర్మించుకునేలా చేయాలని, గృహ నిర్మాణ శాఖ వద్ద ఉన్న పేదల పట్టాలు పేదలకు ఇప్పించాలని డిమాండ్ చేశారు.

లబ్ధిదారులపై జేసీ అసహనం

మాకు న్యాయం చేయాలని నీకోసం లో వినతి పత్రం అందజేసిన మండవల్లి తరుగుమూల ఇందిరమ్మ కాలనీ లబ్ధిదారులపై పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయవద్దు అంటారా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అని పేదలపై జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదల గోడు వినకుండా అసహనం వ్యక్తం చేస్తూ నీకు పట్టాలు ఉంటే చూపించండి.. మీరు అర్హులైతే దరఖాస్తులు పెట్టుకుంటే వేరే చోట స్థలాలు ఇస్తారు అంటూ జెసి మాట్లాడడంతో లబ్ధిదారులు అవాక్కయ్యారు. న్యాయం చేయాల్సిన ఉన్నతాధికారులు ఇలా మాట్లాడితే మా సమస్యను ఇంకెవరికి చెప్పుకోవాలంటూ ప్రశ్నించారు. మాకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామంటూ లబ్ధిదారులు హెచ్చరించారు.

కార్యక్రమంలో కోట జయ, ముక్కు అలివేలు మంగమ్మ, చిగురుపాటి చింతామణి, అవనిగడ్డ వెంకటేశ్వరమ్మ, మాణిక్యం, పద్మ, మరీదు కనకదుర్గ, ఎన్.బుజ్జమ్మ, కసిరెడ్డి ప్రసన్న, జి.సుజాత తదితరులు పాల్గొన్నారు.