The Desk…Eluru : ప్రతి ఒక్కరికీ ఆరోగ్య ప్రదాయిని యోగా

The Desk…Eluru : ప్రతి ఒక్కరికీ ఆరోగ్య ప్రదాయిని యోగా

  • ఇష్టంతో అలవాటు చేసుకుంటే ఒత్తిడులు అధిగమించవచ్చు

ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిలుపు

  • పలు యోగాసనాలతో అబ్బురపరిచిన జిల్లా కలెక్టర్
  • ఈనెల 18న గుంటుపల్లి బౌద్ధరామంలో యోగాంధ్ర

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఆమె ఒక జిల్లా కలెక్టర్. నిత్యం పరిపాలనలో బిజీ. కానీ ఒక సామాన్యురాలు మాదిరిగా అందరిలో కలిసిపోతారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లోనే కాదు.. స్వయంగా కూడా ఆమెకు ప్రతి రోజూ యోగా చేయడం అలవాటు. “యోగా.. ఏదో మొక్కుబడిగా చేయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇష్టంతో చేయండి. నిత్యం ఎన్నో ఒత్తిడుల మధ్య జీవిస్తుంటాం. వాటిని అధిగమించాలంటే యోగా తప్పనిసరి” అంటూ ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు.

పిలుపునివ్వడమే కాదు.. స్వయంగా ఆమె యోగా చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గా విధుల్లో ఎంత బిజీగా వున్న.. మరెన్నో పనులు.. కానీ యోగా చేయడం మాత్రం మానరు. ఆమె చేస్తూ ఇతరులు కూడా యోగా చేసేలా మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. కలెక్టర్ ఒక యోగా గురువు మాదిరిగా వేస్తున్న ఆసనాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ఏలూరు, వట్లూరు లోని టిటిడిసిలోసన్నద్ధక సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వితో పాటు పలువురు జిల్లా అధికారులు, ఉద్యోగులు యోగాసనాలు వేశారు. ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం యోగా శిక్షకులు యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా పలు యోగాసనాలు వేసి అందరిని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అబ్బురపరిచారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతి రోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని పేర్కొన్నారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాటికి రాష్ట్ర ప్రజలందరికీ యోగా ప్రాముఖ్యతను తెలియజెప్పి, యోగాను వారి జీవనశైలిలో భాగస్వామ్యం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.

ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా శనివారం అన్ని గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో సన్నద్ధక సామూహిక యోగా కార్యక్రమం (యోగ డెమో) నిర్వహించడం జరిగిందన్నారు.జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని, ఆ రోజున విశాఖపట్నం బీచ్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల మందితో నిర్వహిస్తుందన్నారు.

ఆ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి పాల్గొంటారని, అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తోందన్నారు. యోగా ప్రాముఖ్యతను తెలుసుకొని యోగ సాధన చేయటం ప్రారంభించానని, దానిని క్రమం తప్పకుండా కొనసాగిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకున్నానన్నారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శరీరంలో ఎన్నో మార్పులు రావడం గమనించి వచ్చాని, శరీర బరువు అదుపులో ఉంటాయన్నారు.

జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు ఇంతవరకు 8,50,189 మంది పౌరులు యోగాంధ్ర యాప్ లో నమోదయ్యారన్నారు. యోగాంధ్ర కార్యక్రమం కింద పర్యాటక ప్రాంతాల్లో నిర్వహిస్తున్న యోగ అభ్యసన కార్యక్రమాల్లో భాగంగా జూన్ 18వ తేదీన కామవరపు కోట మండలం, గుంటుపల్లి బౌద్ధారామం లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, డిఆర్ డి ఏ పిడి డా. ఆర్. విజయరాజు, ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబరీష్, ఆయుష్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీ సుభద్ర, డిఎల్డివో లక్ష్మీ,తాహసిల్దార్ జి.వి.శేషగిరి, సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల ప్రిన్సిపల్ డి. మేరీ ఝాన్సీరాణి, సెర్ప్ కింద ఉపాధి శిక్షణ పొందుతున్న యువతలు,పలువురు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.