గోవధకు పాల్పడిన, అందుకు తోడ్పడిన వారు చట్టరీత్యా శిక్షార్హులని, రానున్న బక్రీద్ సందర్భంగా జిల్లాలో గోవధగాని , గోవుల అక్రమ రవాణా గాని జరగకుండా నియంత్రించాలని, చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులు ఆదేశించారు.
ఈనెల 7వ తేదీన బక్రీద్ పండుగ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో గోవధ నిషేధం పై సంబంధిత అధికారులతో స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ గోవద నిషేధము పశు సంరక్షణ చట్టం 1977 ప్రకారం గోవధను నిషేధించడం జరిగిందన్నారు.
ఇందుకు సంబంధించి జిల్లా, డివిజన్, మండల గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కలిగే విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ సందర్భంగా గో సంరక్షణ జంతు సంక్షేమ సంఘాల సభ్యులు గణేషు, కళ్యాణి రత్న సాయి, తెలంకాయల లీల కుమారి మాట్లాడుతూ.. పెడన గుడివాడ తదితర ప్రాంతాల్లో గోవధ జరుగుతున్నప్పుడు అడ్డుకుంటే బెదిరిస్తున్నారని, పోలీసులకు తెలిపినప్పటికీ సరిగా స్పందించలేదని కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు.
వెంటనే జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. ఇకపై జిల్లాలో గోవధ గాని, గోవుల అక్రమ రవాణా గాని జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, గట్టినిగా ఉంచి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏమైనా ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి గోవధను నియంత్రించాలన్నారు.
సరిహద్దు చెక్‌పోస్ట్‌లలో సరిగా తనిఖీలు చేయాలన్నారు. ధ్రువీకరణ పత్రం లేకుండా ఏ పశువును వధించరాదని ముఖ్యంగా గోవులు పాలు ఇవ్వకపోయినా, ఇతర పశువులు వ్యవసాయానికి పనికి రాకుంటే అటువంటి వాటిని వధించాలంటే ముందుగా పశుసంవర్ధక శాఖను సంప్రదించి ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందన్నారు.
పశువులను వధించాలంటే ఇంటిలో కాకుండా వదశాలలోనే వధించాలన్నారు.జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ద్వారా అన్ని మసీదు కమిటీలకు గోవధ నిషేధం చట్టం గురించి అవగాహన కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి కే. చంద్రశేఖర రావు, అదనపు ఎస్పీ సత్యనారాయణ, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, డిపిఓ అరుణ, జిల్లా రవాణా అధికారి మనీషా తదితర అధికారులు గో సంరక్షణ, గో సంక్షేమ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.