కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న “మసుల” ఉత్సవాలకు అన్ని విధాల సహకారం అందించాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను కోరారు. ఆదివారం సాయంత్రం మంత్రి రహదారులు భవనాల అతిథి గృహంలో మసుల ఉత్సవాల ఏర్పాట్లపై చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ నుండి 8 వ తేదీ వరకు మంగినపూడి బీచ్ లో మసుల ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు.
మచిలీపట్నం చరిత్ర సంస్కృతి ప్రతిబింబించే విధంగా మసులా ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారుఈ ఉత్సవాలకు రాష్ట్రం నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖులు విచ్చేస్తున్నారన్నారు. ముఖ్యంగా కయ కింగ్, కెనోయింగు జల క్రీడలు, బీచ్ కబడి , బీచ్ వాలీబాల్ వంటి జాతీయ రాష్ట్రీయ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.
ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి క్రీడాకారులు మచిలీపట్నంకు వస్తున్నారన్నారు. అంతేకాకుండా పలు ప్రాంతాల నుండి పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ విధంగా వస్తున్న పలువురు ప్రముఖులు, పర్యాటకులు, క్రీడాకారులతో మచిలీపట్నంలో వివిధ రకాల వ్యాపారాలు ముమ్మరంగా సాగనున్నాయన్నారు.
వారికి మచిలీపట్నంలో మంచి వసతి, భోజనం వంటి సౌకర్యాలు కల్పించేందుకు హోటల్ యజమానులు, వివిధ రకాల వ్యాపారస్తులు అందరూ మచిలీపట్నం గొప్ప చరిత్ర, సంస్కృతి పేరు నిలబడేలా వంతు సహకారం అందించాలన్నారు. మచిలీపట్నం ఖ్యాతి నలు దిశల వ్యాప్తి చెందేలా అందరూ తోడ్పడాలన్నారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారుల కమిటీలతో పాటు ప్రైవేటు యాజమాన్యాలతో రాజకీయాలకు అతీతంగా కూడా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
కోనేరు సెంటర్, కోర్టు సెంటర్, లక్ష్మి టాకీస్ సెంటర్ జడ్పీ సెంటర్ వంటి ముఖ్యమైన కూడళ్లలో మసుల ఉత్సవాలకు సంబంధించిన హోర్డింగులను, స్వాగత తోరణాలను ఏర్పాటు చేయాలన్నారు.
సమావేశంలో తాసిల్దారు హరినాథ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోరపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, స్థానిక ప్రముఖులు కుంచె దుర్గాప్రసాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.