- అన్నింటా స్వచ్ఛత మెరుగైన జీవితానికి బాసట
- ప్రతినెలా ప్రత్యేక థీమ్‌తో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం
- ఈ నెల బీట్ ది హీట్ ఇతివృత్తంతో కార్యక్రమం నిర్వహణ
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
🔴 ఎన్‌టీఆర్ జిల్లా : జి. కొండూరు : ది డెస్క్ :

పర్యావరణ హిత క్రమశిక్షణ, సమాజంపై బాధ్యతగా మన నుంచే మార్పు మొదలవ్వాలని, మనం వేసే ఒక చిన్న అడుగు, పెద్ద విజయానికి దారితీస్తుందని, అన్నింటా స్వచ్ఛత మెరుగైన జీవితానికి బాసటగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.శనివారం జి.కొండూరు ఓల్డ్ శివసాయి హోటల్ సమీపంలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర (ఎస్ఏఎస్ఏ) కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర @ 2047 దార్శనిక పత్రంలోని పది సూత్రాల్లో సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర అనేది ఒక సూత్రంగా ఉందని వివరించారు.
ఈ నేపథ్యంలో ప్రతి నెలా మూడో శనివారం ఒక ప్రత్యేక థీమ్‌తో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల బీట్ ది హీట్ ఇతివృత్తంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతిఒక్కరూ పర్యావరణం, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని.. తప్పనిసరి పరిస్థితుల్లో విస్తృత ప్రజాప్రయోజన అభివృద్ధి కార్యక్రమం కోసం ఒక చెట్టును నరకడం తప్పనిసరైతే పది మొక్కలు నాటాలని సూచించారు.
హరిత విస్తీర్ణాన్ని పెంచడం వల్ల మనకు, భావితరాలకు ఆరోగ్యకర జీవితం సొంతమవుతుందని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు.*వేసవి తాపాన్ని తట్టుకునేలా:*ప్రజలు వేసవి తాపాన్ని తట్టుకునేందుకు వీలుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములవుతున్నారన్నారు.
చలివేంద్రాల ఏర్పాటు, అన్ని కార్యాలయాల్లో మంచి నీటి సౌకర్యం ఉండేలా చూడటం, ఇంకుడు గుంతలు, నీటి రీఛార్జ్ నిర్మాణాలు తదితరాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నామన్నారు. వడదెబ్బ నుంచి రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఒకవేళ వడదెబ్బకు గురైతే తీసుకోవాల్సిన ప్రాథమిక చికిత్స చర్యల గురించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. చిన్నారులకు బీట్ ది హీట్‌పై డ్రాయింగ్, వ్యాస రచన తదితర పోటీలు నిర్వహించడం జరుగుతోందన్నారు.
కార్యాలయాలు, భవనాల టెర్రాస్‌పై సోలార్ రిఫ్లెక్టివ్ వైట్ పెయింట్స్ వేయించి వేడిని తగ్గించే చర్యలను సూచిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ శ్రామికులు ఉదయం త్వరగా మొదలు పెట్టి పనులు పూర్తయ్యేలా చూస్తున్నామని.. పని ప్రదేశంలో నీటి సౌకర్యం ఉండేలా చూడటంతో పాటు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించజడం జరుగుతోందన్నారు.
మనుషులతో పాటు పశుపక్ష్యాదులకు నీటి తొట్లు, మట్టి పాత్రలు ఏర్పాటుచేసి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు తెలిపారు. నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ లక్ష్మీశ.. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పి.సుబ్బారావు, చెవుటూరు గ్రామ సర్పంచి పి.శ్రీదేవి, డీపీవో పి.లావణ్య కుమారి, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, డ్వామా పీడీ ఎ.రాము, తహసీల్దార్ సీహెచ్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో బీవీ రామకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.