- ‘ఆపరేషన్ సిందూర్‘ను స్వాగతించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ప్రపంచ శాంతికి విఘాతంగా మారిన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించడమే భారత్ లక్ష్యం అని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పిఓకే ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన ప్రతీకార దాడిని ఎంపీ మహేష్ కుమార్ స్వాగతించారు. ఏలూరు శాంతినగర్ లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
భారత సైన్యం ప్రతీకార దాడి నిర్వహించిన కొన్ని గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమై తదుపరి చర్యలపై చర్చించిందని ఎంపీ తెలిపారు. సైన్యం నిర్వహించిన ఆపరేషన్ను కేంద్ర మంత్రివర్గంతో పాటు యావత్ భారత్ జాతి ప్రశంసించిందని ఎంపీ పేర్కొన్నారు.
కేబినెట్ భేటీకి ముందు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ సరిహద్దుల్లో పరిస్థితి గురించి ప్రధానికి వివరించారని ఎంపీ తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై సైన్యం మెరుపు దాడులు నిర్వహించడం ద్వారా ఉగ్రవాదులకు భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసిందని ఎంపీ అభిప్రాయ వ్యక్తం చేశారు. అత్యంత కచ్చితత్వంతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని 9 ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపిందని, పాకిస్తాన్ తిరిగి దాడికి దిగితే తిప్పి కొట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఎంపీ తెలిపారు.
ఉగ్రవాదాన్ని కట్టడి చేసే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారని ఎంపీ పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, భారత సైన్యం అండగా ఉందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భరోసా ఇచ్చారు.