🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :
పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దేక్రమంలో నగరంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని కమిషనరు కేతన్ గార్గ్ తెలియచేసారు. నగరంలో ఏర్పాటు చేయుటకు నిర్ణయించిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కొరకు భవనాలను పరిశీలించారు.
ఈ సందర్భముగా కేతన్ గార్గ్ మాట్లాడుతూ… రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రధాన కేంద్రం అమరావతి నగరములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా, ఆంధ్రప్రదేశ్ ను ఒక నూతన ఆవిష్కరణ కేంద్రముగా అభివృద్ది చేయడం లక్ష్యముగా ముఖ్యమంత్రి అక్టోబరు’2024లో ప్రారంభించినారని, దీనికి అనుబంధముగా రాష్ట్రంలో వివిధ ప్రాంతములలో అయిదు ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు ప్రతిపాదించి, దానిలో ఉభయ గోదావరి జిల్లాల సమాన అభివృద్ది కొరకు రాజమహేంద్రవరం ప్రాంతీయ కేంద్రముగా ఆమోదించిన దరిమిలా ఉన్నతాధికారుల బృందము, తూర్పుగోదావరి జిల్లా కలెక్టరు నేతృత్వములో స్థానికముగా అందుబాటులో వివిధ భవనములను పరిశీలించి మోరంపూడిలోని వేంకటేశ్వరస్వామి గుడి సమీపములో “PUDI’s SRINIVASAM” భవనము, అమరావతి గార్డెన్స్ నందు ఏర్పాటు చేయుటకు నిర్ణయించామని తెలియచేసారు.
ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధమిక లక్ష్యము పరిశోధన మరియు అభివృద్ధి కోసం సహకారం, స్థార్ట్ అప్ లకు కార్యాలయ స్థలం, నిధులు, మార్గదర్శనం వంటి సేవలు, ఉపాధి మరియు వ్యాపార నైపుణ్యాలను పెంచే శిక్షణలు, విద్యా మరియు పరిశ్రమ మధ్య ఖాళీలను తగ్గించేందుకు అనుసంధానం మున్నగు ప్రక్రియలకు ఆలంబనగా తీర్చిదిద్దాలని ప్రభుత్వము ధృడ సంకల్పముతో ఉన్నదన్నారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఒక మౌలిక సదుపాయంలా కాకుండా, ఆవిష్కరణకు ప్రేరణ ఇచ్చే ఉద్యమంగా నిలుస్తోంది. రతన్ టాటా సేవలను స్మరించుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు అవకాశాలను అందిస్తూ, ఈ హబ్ అభివృద్ధికి మార్గాన్ని నిర్దేశిస్తుంది. భవనాల పరిశీలనలో ఆర్.డి.ఓ. కృష్ణ నాయక్, సిటీ ప్లానరు జి. కోటయ్య తదితరులు పాల్గొన్నారు.