The Desk…సుపరిపాలన కోసం పంచాయతీ రాజ్ వ్యవస్థ

The Desk…సుపరిపాలన కోసం పంచాయతీ రాజ్ వ్యవస్థ

  • జాతీయ పంచాయతీ రాజ్ దివాస్

ది డిజిటల్ డెస్క్ :

ప్రాచీనకాలంలో గ్రామ పాలనా వ్యవస్థ ఆనాటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా ఐదు ప్రధాన వృత్తులు చేస్తున్న ప్రతినిధులు స్థానిక సాంఘీక పాలకులుగా గుర్తింపు పొందగా, మద్యయుగంలో ఆదిపత్య పోరుతో ప్రదాన వృత్తులు చేస్తున్న స్థానిక పాలకులు అణచివేతకు గురయ్యారు. బ్రిటిష్ పాలన ప్రారంభంలో ఐదు వృత్తుల పాలకులు అంతగా ఆధరణకు నోచుకోక పోవడం వలన స్థానిక సంఘీక పాలన కనుమైరుగైయింది.

బ్రిటీష్ గవర్నర్ జనరల్ లార్డు రిప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు మళ్ళీ పునరుజ్జీవనం పొందాయి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు స్థానిక సంస్థలకు బలం చేకూర్చాయి. భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత డా. బాబాసాహేబ్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యంగం అమలులోకు రావడం, భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించడం జరిగింది. ప్రజా సంక్షేమం కోసం పాలకులు రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరణ చేసారు.

73వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ చరిత్రకెక్కగా, 1959 నవంబరు 1న, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే రెండవదిగా, మహబూబ్ నగర్ జిల్లా, షాద్‌నగర్ లో ప్రారంభమైంది. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాకు స్ధాయిలో పంచాయతి సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ 1986లో బ్లాకు స్ధాయి వ్యవస్థని మండల పరిషత్ గా మార్చారు.73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1994లో నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని చేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

2010 నుంచి ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇంచుమించు 30 లక్షల మంది ప్రజా ప్రతినిధులతో నడుస్తున్న మన ‘పంచాయితీ రాజ్ వ్యవస్థ’ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రధానంగా మన గ్రామాలకు ఇది వెన్నెముకగా పనిచేస్తుంది. దేశ వ్యాప్తంగా సుమారు 718 జిల్లా పంచాయితీలు, 6,097 మండల పంచాయితీలు, 2,34,676 గ్రామ పంచాయితీలు పనిచేస్తున్నాయి.పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని 1993 ఏప్రిల్ 24 నుండి అమలులోకి వచ్చిన 1992 రాజ్యాంగ (73వ సవరణ) చట్టం, గుర్తుగా నిర్వహిస్తారు. స్థానిక స్వపరిపాలనా సంస్థల వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ అనికూడా అంటారు.గ్రామ రాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలని గాంధీజీ కలలు కన్నారు.

ఆయన దృష్టిలో ప్రతి గ్రామపంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధే. అందువల్ల గ్రామాభ్యుదయానికి గ్రామపంచాయతీల ఏర్పాటు, వాటికి విస్తృత అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చింది.పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపడటానికి వీలు కల్పించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల మంత్రిత్వ శాఖలతో దీనికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతుంది.

పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎందుకు?

వనరుల పంపిణీలను మెరుగుపరచడానికి…ప్రభుత్వ పనుల్లో స్థానికులు పాల్గొనేలా చేయడానికి…గ్రామీణ ప్రజల దైనందిన అవసరాలను మేలైన పద్ధతిలో తీర్చడానికిస్థానికంగా అధికంగా ఉద్యోగాలు కల్పించడానికి.పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేయడానికి పంచాయతీలకు వాస్తవమైన అధికారాలను అందిస్తే స్వావలంబన, స్వీయ చొరవను, సహకారాన్ని పెంపొందించి గ్రామీణ సమాజ రూపురేఖలను మార్చడానికి దోహదం చేస్తాయి.ప్రజలు పాల్గొనే ప్రజాస్వామ్యానికి రూపకల్పన చేస్తాయి. పంచాయతీ రాజ్ వ్యవస్థ వల్ల ప్రతి చిన్న పనికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడటం జరగదు. కేంద్ర, రాష్ట్ర పాలనా యంత్రాంగంపై అధిక పనిభారాన్ని, ఒత్తిడిని తగ్గించడం. ఆలస్యాన్ని నివారించి ప్రజల సమస్యలపై ప్రభుత్వం త్వరగా స్పందించేలా చేయడం. సేవల పరిమాణాలను పెంచడం, వికేంద్రీకరణ పంచాయతీరాజ్ ముఖ్య ధ్యేయాలు.

గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పాటుతో ప్రజల ముంగిటకు ప్రభుత్వ సేవలు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అదికారాలకు దూరంగా ఉన్న అనేక కులాలు ఉన్నాయి. పంచాయతీ రాజ్ చట్టం అమలుతో అదికారి వికేంద్రీకరణ జరిగి అనేక కులాలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు స్థానిక సంస్థలలో రాజ్యాదికారానికి దగ్గిరయ్యారు. అంటే స్థానిక సంస్థలలో బహుజనులు ప్రజా ప్రతినిధులు అయ్యి నిర్ణయాదికారం దిశగా అవకాశం పొందారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక పంచాయతీ రాజ్ వ్యవస్థ అని గుర్తింపు పొందినా, స్థానిక స్వపరిపాలన పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా జరగవల్సి ఉన్నా గ్రామీణ ప్రాంతాలలో ప్రజల అవసరాలు తీరడానికి, సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు అవడానికి, ప్రజా సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం సేవలు అందించడానికి స్వర్ణంద్ర 2047 విజన్ సాకారం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రచిస్తుంటే, పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉప ముఖ్యమంత్రి కొణేదల పవన్ కళ్యాణ్ సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఆచరణత్మక ఆలోచన విధానాన్ని స్థానిక సంస్థలలో అమలు చేస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గడపగడపకు చేరుతు పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసారు. దానిలో భాగంగా వాట్సాప్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు, వాటి ప్రగతి తెలుసుకునే వ్యవస్థను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది ఈ మంచి ప్రభుత్వం. సుమారు 600 ప్రాథమిక ప్రజా సేవలు నేరుగా గ్రామ పంచాయతీల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న 3 కోట్ల మందికి పైబడి అందుతున్నాయి.

ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో మన రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలిచిందంటే మన పంచాయతీ రాజ్ వ్యవస్థ సాదికారత ఏస్థాయిలో ఉందో చెపచ్చు. రాష్ట్ర బడ్జెట్లో అత్యదిక శాతం ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తు, గ్రామీణ ప్రాంతాల ప్రగతికి అత్యదిక నిదులు ఖర్చు చేస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందంటే అది పటిష్ట పంచాయతీ రాజ్ వ్యవస్థ రాష్ట్రంలో ఉందని, ఆ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సహకారమని చెపచ్చు.

ప్రభుత్వం గ్రామస్థాయిలో పంచాయతీ వ్యవస్థ ద్వారా ప్రజా సుపరిపాలన జరగాలని, ముఖ్యంగా గిరిజన ఏజెన్సీ ప్రాంతాలలో పీసా చట్టాన్ని అమలు చేయాలని పంచాయితీ రాజ్ చట్టలకు పదును పెట్టింది. పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో సుమారు 1కోటి 50 లక్షల కుటుంబాలకు డైరైక్టు బెనిఫిట్ ట్రాన్సఫర్ ద్వారా దళారుల ప్రమేయం లేకుండా పారథర్శకంగా లబ్దిదారులకు అందుతున్నాయంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ గొప్పతనంగా భావించవచ్చు.

గ్రామ స్వరాజ్యం, ప్రజా సుపరిపాలన, పారథర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు, సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలు జరగుతు ప్రజా స్వామ్య బద్దంగా ఎన్నుకున్న ప్రభుత్వంపై ప్రజలకు విశ్వసం పెరగాలంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కుల, మతాలకు, పార్టీలు ప్రాంతాలకు, అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు నిస్వార్థ సేవలు అందించాలనే ధ్యేయంగా సేవలందించాలి. స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిదుల సహకారంతో పాటు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిదుల అదికారాలలో జోక్యం తగ్గించి స్వతంత్ర ప్రతిపర్తి కలిగించాలి.

ప్రజాస్వామ్య ఉజ్వల భవిష్యత్తు పంచాయతీ రాజ్ వ్యవస్థల అమలు తీరు సక్రమంగా ఉండాలి. జాతీయ పంచాయతీ రాజ్ దివాస్ 2025 థిమ్ గా ఉన్న “మై పంచాయతీ మై ప్రయిడ్” నినాదాన్ని ప్రజాభాగస్వామ్యంతో ఆచరణ సాధ్యం చెయ్యాలి. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్రయం నాయకత్వంలో దేశంలో, రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింత బలోపేతం అవుతుందని విధులు, నిధులు పెరిగి స్థానిక సూపరిపాలన అర్ధవంతంగా జరుగుతుందని ఆశిద్దాం. జనాభాలో చైనాను మించిన మన భారతదేశం పాలకుల సేవా పటిమతో గ్రామీణ భారతం, రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియాలంటే ప్రజల సహకారం తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాకారం అవుతుంది.

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు

తూతిక శ్రీనివాస విశ్వనాథ్, MBA, LLM, మాజీ సైనికుడు, పూర్వపు డీపీఓ (పశ్చిమగోదావరి & ఏలూరు జిల్లాలు)పూర్వపు ఈడీ ఎస్సీ కార్పొరేషన్, ప్రకాశం జిల్లా, 7675924666, 24.04.2025