The Desk…Eluru : ల్యాబ్ పరికరాలు సిద్ధం… ప్రయోగాలు కీలకం

The Desk…Eluru : ల్యాబ్ పరికరాలు సిద్ధం… ప్రయోగాలు కీలకం

  • పాఠశాలలకు రూ. 2 కోట్లుతో ల్యాబ్ పరికరాలు సమకూర్చిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

విజ్ఞాన శాస్త్రానికి ప్రయోగశాల ఒక శక్తిమంతమైన అభ్యాసన వనరుగా గుర్తించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆ దిశగా దృష్టి సారించారు. విజ్ఞానశాస్త్ర విద్యలో అంతర్భామైన ప్రయోగశాల సైన్స్ కు చెందిన వివిధ భావనలు అర్థం చేసుకుని జ్ఞానాన్ని పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుందని ఎంపీ మహేష్ కుమార్ గుర్తించారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల సందర్శన సందర్భంగా ల్యాబ్ పరికరాల కొరత ఉన్నట్లు ప్రధానోపాధ్యాయుల ద్వారా తెలుసుకున్నారు.

ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థులు ప్రత్యక్ష అనుభవ విజ్ఞానాన్ని పొందగలుగుతారని, ప్రయోగశాలల ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులలో పరిశీలన, వర్గీకరణ, విశ్లేషణ మొదలైన నైపుణ్యాలు పెంపొందించగలరని భావించిన ఎంపీ మహేష్ కుమార్ ల్యాబ్ పరికరాలు సమకూర్చుతానని ఎంపీ మహేష్ కుమార్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎంపీ నిధుల నుంచి రూ.2 కోట్లు కేటాయించారు.

ఏలూరు పార్లమెంటు పరిధిలో మొదటి విడతగా 50 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు రూ.4 లక్షల విలువైన ల్యాబ్ పరికరాలను ఇటీవల స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఇన్చార్జి కలెక్టర్ ధాత్రిరెడ్డి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, డిఈఓ వెంకట లక్ష్మమ్మ, అధికారులతో కలిసి ప్రధానోపాధ్యాయులకు అందజేశారు.

ఒక్కో పాఠశాలకు ఇచ్చిన కిట్లలో 250 వరకు భౌతిక, రసాయన, గణిత, సామాజిక శాస్త్రాల ల్యాబ్ పరికరాలు ఉన్నాయి. వీటి ద్వారా విద్యార్థులు ప్రయోగాలు చేయడం వల్ల వివిధ విజ్ఞాన శాస్త్ర విషయాలపై ఆసక్తి పెంచుకుని, వాటి గురించి తెలుసుకుని భవిష్యత్తుకు విజ్ఞానపరంగా బాటలు వేసుకునేందుకు దోహదం చేయనుంది.

మలి విడతల్లో మిగిలిన పాఠశాలలకు ల్యాబ్ పరికరాలు పంపిణీ. శాస్త్రీయ దృక్పథాన్ని, పెంపొందించుకోవడమే కాకుండా వివిధ విషయాలను తెలుసుకోవడంలోనూ, సమస్య పరిష్కారం చేయడంలోనూ శాస్త్రీయ పద్ధతిని విద్యార్థులు వినియోగించుకోగలుగుతారు.అంతేకాక ప్రయోగశాలలో చేసే ప్రాక్టికల్స్ వల్ల విజ్ఞానాత్మక సామర్థ్యాలు, శాస్త్రీయ వైఖరులు, విజ్ఞానశాస్త్రం పట్ల అవగాహన పెంపొందించుకోవడానికి వీలు కలుగుతుంది.

గతంలో ఏ ఎంపి చేయని విధంగా ఉన్నత పాఠశాలలకు ల్యాబ్ పరికరాలు సమకూర్చిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు. మలి విడతల్లో మిగిలిన పాఠశాలలకు కూడా ల్యాబ్ పరికరాలు సమకూర్చుతామని ఎంపీ మహేష్ కుమార్ చేసిన ప్రకటనను ప్రధానోపాధ్యాయులు స్వాగతిస్తున్నారు.

ఇప్పటి వరకు ఉన్నత పాఠశాలలో ప్రయోగాల తరగతుల నిర్వహణకు ల్యాబ్ పరికరాల కొరత అవరోధంగా మారింది. ఇకపై ఎంపీ మహేష్ కుమార్ సమకూర్చిన ల్యాబ్ పరికరాలతో ఫలవంతంగా నిర్వహించడానికి వీలు కలుగుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.