The Desk…RJY : స్వచ్ఛాంధ్రప్రదేశ్ వైపు పయనిద్దాం : మంత్రి కందుల

The Desk…RJY : స్వచ్ఛాంధ్రప్రదేశ్ వైపు పయనిద్దాం : మంత్రి కందుల

  • ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్‌ పై దృష్టి
  • రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
  • ప్రతినెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
  • స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని పిలుపు
  • రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్ అనేది ఈ – వేస్ట్ కలెక్షన్ సెంటర్ల నినాదం కావాలని పిలుపు

🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన సందేశాన్ని అందిపుచ్చుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ వైపు పయనిద్దామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. శనివారం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.

చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ సాధ్యం అవుతుందన్న ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(ఈ-వేస్ట్) సేకరించి వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడంపై దృష్టి సారించామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్ అనేది ఈ – వేస్ట్ కలెక్షన్ సెంటర్ల నినాదం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సంబంధిత పోస్టర్ ను విడుదల చేసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ... 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ నినాదమిచ్చారని తెలిపారు. ఈ క్రమంలో స్వర్ణాంధ్ర-2047 సంకల్పంలో భాగంగా ప్రభుత్వం ప్రతినెలా స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్‌ కార్యక్రమం నిర్వహిస్తోందని, ఈ నేపథ్యంలో ఈ శనివారం ‘ఈ-చెక్‌’ థీమ్‌తో కార్యక్రమం చేపట్టిందన్నారు.

ఈ-వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్‌ చేయడంపై దృష్టి సారించిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని సూచించారు. ఈ -వ్యర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించి కార్యక్రమంలో వారిని భాగస్వామ్యులు చేసేలా చైతన్యం కల్పించాల్సిన అవసరాన్ని అధికారులకు మంత్రి వివరించారు.

ఈ సందర్భంగా ప్రజలంతా తమ తమ గృహాల్లో వృథాగా పడ వేసిన కంప్యూటర్ లు, టీవీలు, మొబైల్ పరికరాలు తదితర ఈ-వ్యర్థాలతో వచ్చే సమస్యలను మంత్రి దుర్గేష్ వివరించారు. ఈ-వ్యర్థాలను వినియోగించకుండా ఇంట్లోనే ఉంచడం వల్ల లేదా బహిరంగ ప్రదేశాల్లో పారవేయడం వల్ల పర్యావరణం కలుషితం అవడమే గాకుండా అనారోగ్యాల బారిన పడే అవకాశముందని తెలిపారు.

ఈ తరుణంలో ఈ-వ్యర్థాలను యథేచ్ఛగా, విచ్చలవిడిగా పడేయకుండా తిరిగి పునఃవినియోగించేలా సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేశారన్నారు. అందులో భాగంగా మున్సిపాలిటీలు, గ్రామాల నుండి ఏర్పాటు చేసిన ఏజెన్సీలకు సంబంధిత ఈ-వేస్ట్ ను అప్పజెప్పడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి పాటించాలన్నారు. తద్వారా స్వచ్ఛఆంధ్రప్రదేశ్ సాధించగలుగుతామన్నారు. 10వేల మైళ్ల ప్రయాణం కూడా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుందన్న వ్యాఖ్యలను ఉదహరిస్తూ సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన సందేశాన్ని అందిపుచ్చుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ వైపు పయనిద్దామని నగర పౌరులకు మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ… ఈ వేస్ట్ వస్తువులైన ఎలక్ట్రాన్ గూడ్స్ టీవీలు సెల్ ఫోన్లు ఏసీలు కూలర్లు వంటివి వస్తువులు ఈ వేస్ట్ కలపటం జరుగుతుందని వీటిని సాధారణంగా డ్రై వేస్ట్ లోనే కలుపుతున్నామని ఆమె అన్నారు. దీనివలన కెమికల్స్ రేడియేషన్ పెరిగి వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని దీనిని నివారించడానికి శాస్త్రవేత్తలు పలు మార్గాలు సూచించారని వాటిని పాటించవలసినదిగా ఆమె తెలియజేశారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ సరైన రీతిలో మనం డిస్పోజ్ చేయని యెడల వాతావరణ కాలుష్యమే కాక భూమిలో కలిసి మట్టి కూడా కలుషితం అవుతుందని ఆమె అన్నారు. గతంలో బయో కెమికల్ వేస్ట్ ను చెత్తలో కలిపి డిస్పాచ్ చేయడం తెలుసుకొని ఉన్నామని ఆమె అన్నారు. దీనివలన భావితరాల వారికి హాని కలుగుతుందని, జీవన సరళి ప్రమాదంలో పడితే పడే అవకాశం ఉందని ఆమె అన్నారు.

రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు ) మాట్లాడుతూ…

ఈ వేస్ట్ అనే ఎలక్ట్రాన్ గుడ్ సంబంధించి లాప్టాప్ లు సెల్ ఫోన్ కంప్యూటర్లు వంటివి వాతావరణానికి ఎంతో ప్రమాదకరమని, వాటిని నివారించవలసిన బాధ్యత మన అందరిపై ఉందని ఆయన అన్నారు. కొన్ని దేశాల వారు ఆ దేశంలోని ఎలక్ట్రానిక్స్ కు సంబంధించి ఈ వెస్ట్ ను షిప్పుల ద్వారా సముద్ర మార్గంలో అభివృద్ధి కాని దేశాలకు తరలిస్తున్నారని అందువలన జల, వాయు వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని ఆయన అన్నారు.

రాజానగరం శాసన సభ్యులు బత్తుల బలరామ కృష్ణ మాట్లాడుతూ…

ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ వలన జల వాయు శబ్ద కాలుష్యం ఏర్పడి వాతావరణంలో పలుమార్పులు సంభవిస్తున్నాయని దీనివలన అకాల వర్షాలు, వర్షాలు సంభవించి ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుందని ఆయన అన్నారు. దీని నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు.

సభాద్యక్షులు రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ కేతన గార్గ్ మాట్లాడుతూ… 

స్వర్ణాంధ్ర స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ వెస్ట్ అంటే ఎలక్ట్రానిక్ పరికరాలను సపరేట్ చేసి వాటిని భూమిలో పాతివేయాలని,  వాటిని  ఎక్కడ పెడితే అక్కడ చెత్తలో వేయరాదని దీని వలన వాతావరణ కాలుష్యం పెరిగి మనవాళ్ళకి ఉప్పు కలుగుతుందని ఆయన అన్నారు.

గతంలో పొడి చెత్త తడి చెత్త అని వేరువేరుగా సేకరించే వారిని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వేస్ట్ ను సేకరించడం జరుగుతుందని ఆయన అన్నారు.కార్యక్రమంలో రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు.