దిల్లీ/ ఏలూరు : ది డెస్క్ :
కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు 2020-21లో కోవిడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్యాకేజ్-1 కింద రూ.8473.73 కోట్లు, ఈ.సి.ఆర్.పి-2 ద్వారా రూ.12,740.22 కోట్లు, పీఎం- ఏ.బి.హెచ్.ఐ.ఎం ద్వారా 2022-23 నుంచి 2024-25 వరకు రూ. 4500.64 కోట్లు మంజూరు చేయగా, ఈ మూడు పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు రూ.940.71 కోట్లు కేటాయించినట్లు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ తెలిపారు.
గతంలో వచ్చిన మహమ్మారి కారణంగా ఏర్పడిన భారీ ఆర్థిక నష్టాలను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో వైద్యం, అత్యవసర మౌలిక సదుపాయాల సంసిద్ధత, పరిశోధకులు, నిపుణుల సంఖ్య, గత మూడేళ్లలో ఏపీకి కేటాయించిన నిధుల వివరాలు, ప్రజలకు అవగాహన కల్పించడానికి చేపట్టిన కార్యక్రమాలపై పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ శుక్రవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రత, వృద్ధుల కోసం పింఛన్లు, ఆరోగ్య సదుపాయాల కల్పన, అల్పాదయ వర్గాల వారికి పక్క ఇళ్ల నిర్మాణం, ఆహార భద్రత వంటి చర్యలు తీసుకుందని, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మౌలిక సదుపాయాలపై ఖర్చు పెంచిందని, ఫలితంగా 2021-22 నుంచి 2024-25 మధ్య దేశం సగటున 8.2% వృద్ధి సాధించిందని కేంద్ర మంత్రి తెలిపారు.
భవిష్యత్తులో ఏదైనా మహా మరి వస్తే అధిగమించటానికి కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకి సాంకేతిక, ఆర్థిక సహాయం అందిస్తోందని, పబ్లిక్ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, వైద్య సిబ్బంది నియామకం, పీఎం- ఏ.బీ.హెచ్.ఐ.ఎం పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి, జిల్లా ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మెరుగుపరిచామని, పీ.ఎం.ఎస్.ఎస్.వై పథకం ద్వారా ఎయిమ్స్ వంటి మెరుగైన వైద్య విద్యాసంస్థలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేస్తున్నట్లు, వెనుకబడిన జిల్లాల్లో మెడికల్ కాలేజీలో ఏర్పాటును కేంద్రం ప్రోత్సహిస్తుందని కేంద్రమంత్రి బదులిచ్చారు. మహమ్మారి పరిశోధన, వ్యాక్సిన్లు, ఔషధాలు, డయాగ్నోస్టిక్స్ మొదలైన ఆర్ అండ్ డి పనులు ఆరోగ్య పరిశోధనా శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని కేంద్రమంత్రి తెలిపారు.
మహమ్మారులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ‘స్వస్థ నాగరిక్ అభియాన్’ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని, జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్రాలు చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లో ఆరోగ్యవంతమైన జీవనశైలిని పెంచిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.