The Desk…Eluru :  మౌలిక సదుపాయాలకు రూ.15.26 కోట్లు మంజూరు చేయండి

The Desk…Eluru : మౌలిక సదుపాయాలకు రూ.15.26 కోట్లు మంజూరు చేయండి

  • కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ కు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి

🔴 దిల్లీ /ఏలూరు : ది డెస్క్:

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి, నూజివీడు ట్రిపుల్ ఐటిలో మౌలిక వసతుల కల్పనకు రూ.15.26 కోట్లు సిఎస్ఆర్ నిధులు మంజూరు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ కు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు దిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ను ఎంపీ మహేష్ కుమార్ మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. చుట్టుపక్కల ఐదు జిల్లాల పరిధిలోని రోగులకు సేవలందిస్తున్న ఏలూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జిజిహెచ్)కు అత్యవసర వైద్య పరికరాలు సమకూర్చడం కోసం పవర్ గ్రిడ్ నుంచి సిఎస్ఆర్ నిధులు రూ.3.09 కోట్లు మంజూరు చేయాలని ఎంపీ మహేష్ కుమార్ కోరారు.

ఇటీవల ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా రోగులు పలు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి వీలుగా కీలకమైన వైద్య పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉందని ఎంపీ మహేష్ కుమార్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే నూజివీడు ట్రిపుల్ ఐటీలో అకడమిక్ లాబొరేటరీలను సమకూర్చడానికి ఎన్టిపిసి నుంచి సిఎస్ఆర్ నిధులు రూ.12.17 కోట్లు మంజూరు చేయాలని ఎంపీ మహేష్ కుమార్ కేంద్ర మంత్రికి విన్నవించారు.

ప్రయోగశాలల్లో పరికరాలు లేకపోవడం, విశ్వవిద్యాలయం స్థాపన సమయంలో అందించిన పరికరాలు 90 శాతం వాడుకలో లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ఎంపీ మహేష్ కుమార్ కేంద్ర మంత్రికి వివరించారు.

కొత్త పరికరాలను సమకూర్చడం కోసం ఆయా విభాగాలకు విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే ఎన్టిపిసి నుంచి రూ.12.17 కోట్లు సిఎస్ఆర్ నిధులు మంజూరు చేయాలని ఎంపీ విన్నవించారు. తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు.